Jadeja On Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా టూర్ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన గబ్బా టెస్టు డ్రా తర్వాత విలేకరుల సమావేశంలో అతను ఈ సమాచారం ఇచ్చాడు. వెటరన్ క్రికెటర్ రిటైర్మెంట్ నిర్ణయం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను (Jadeja On Ashwin Retirement) కూడా ఆశ్చర్యపరిచింది. రోజంతా అశ్విన్‌తో ఉన్నానని అయితే ఐదు నిమిషాల ముందే అతడి నిర్ణయం తెలిసిందని జడేజా చెప్పాడు. ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.
“విలేఖరుల సమావేశానికి కేవలం ఐదు నిమిషాల ముందు అతని రిటైర్మెంట్ గురించి నాకు తెలిసింది. ఇది షాకింగ్‌గా ఉంది. మేము రోజంతా కలిసి ఉన్నాం. అశ్విన్ నాకు ఎటువంటి హింట్ కూడా ఇవ్వలేదు. నాకు చివరి క్షణంలో తెలిసింది” అని జడేజా శనివారం MCG వద్ద విలేకరులతో అన్నారు. అశ్విన్‌తో జడేజాకు మంచి అనుబంధం ఉంది. అశ్విన్‌ను తన ఆన్-ఫీల్డ్ మెంటార్‌గా జడేజా అభివర్ణించాడు. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత యువత ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అశ్విన్ తన కెరీర్‌లో 106 టెస్టు మ్యాచ్‌లు ఆడి 537 వికెట్లు తీశాడు.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం.. మరోసారి ఆంక్షలు!
“అతను నా ఆన్-ఫీల్డ్ మెంటార్ లాంటివాడు. మేము చాలా సంవత్సరాలు కలిసి ఆడాము. మేము మ్యాచ్ పరిస్థితి గురించి, బ్యాట్స్‌మెన్ ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే దాని గురించి మైదానంలో ఒకరికొకరు సందేశాలు ఇస్తూనే ఉంటాము” అని జడేజా విలేకరులకు తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ.. “నేను ఇవన్నీ మిస్ అవుతాను. అశ్విన్ కంటే మెరుగైన ఆల్ రౌండర్, బౌలర్ టీమిండియాకు లభించాలని ఆశిస్తున్నాను. కానీ ఆ ఆటగాడిని ఎవరూ భర్తీ చేయలేరు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే యువతకు ఇదో సువర్ణావకాశం” అని ఆయన పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో జడేజా 77 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫాలో-ఆన్‌ను నివారించడంలో, మ్యాచ్‌ను డ్రా చేయడంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. గబ్బా ఇన్నింగ్స్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని జడేజా అన్నాడు. జట్టు కష్టతరమైన స్థితిలో ఉన్నప్పుడు స్కోర్ చేయడం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నాడు.