Ravindra Jadeja: చెన్నైతో జడ్డూ బ్రేకప్ ?

చెన్నై సూపర్ కింగ్స్ తో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్రేకప్ అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

  • Written By:
  • Publish Date - July 9, 2022 / 10:23 AM IST

చెన్నై సూపర్ కింగ్స్ తో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్రేకప్ అనుమానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న జడ్డూ తర్వాత తప్పుకున్నాడు. అప్పుడే మేనేజ్ మెంట్ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న జడేజా పలు సందర్భాల్లో హింట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో సైతం జడేజాను సీఎస్ కే అన్ ఫాలో చేయడం వంటి పరిణామాలతో జడేజాకు చెన్నైతో ఇదే చివరి సీజన్ అన్న వార్తలు వచ్చాయి.

తర్వాత ఈ వార్తలను ఆ జట్టు సీఈవో ఖండించినా జడేజా మాత్రం స్పందించలేదు. తాజాగా మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది. దీనికి కారణం రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సంబంధించిన అన్ని రకాల పోస్టులను తొలిగించాడు. గత కొన్నేళ్ళుగా సీఎస్ కే పై చేసిన పోస్టులను తొలగించడంతో చెన్నైతో జడ్డూ బంధం ముగిసినట్టేనని భావిస్తున్నారు. నిజానికి ఐపీఎల్‌-2022కు రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవడంతో కొత్త కెప్టెన్ గా జడేజా ఎంపికయ్యాడు. అయితే సారథ్య బాధ్యతల చేపట్టిన జడేజా వరుస ఓటములతో ఒత్తిడి కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. దీంతో చెన్నై యాజమాన్యం మళ్ళీ ధోనీకే పగ్గాలు అప్పగించింది.

అనంతరం గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు జడేజా దూరమయ్యాడు. వ్యక్తిగతంగానూ 15వ సీజన్ లో జడేజా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో పాటు కెప్టెన్సీ విషయంలో చెన్నై యాజమాన్యం వైఖరిపై కూడా అతను మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ కారణాలతో వచ్చే సీజన్ నుంచి అతను చెన్నై జట్టుకు ఆకపోవచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు
సీఎస్‌కే పోస్టులను డిలీట్‌ చేయడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చునట్టైంది. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న జడేజా తిరిగి ఇంగ్లండ్‌తో టెస్టుకు భారత జట్టులో చేరాడు. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో సెంచరీ చేసిన ఈ ఆల్ రౌండర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టులో సభ్యునిగా ఉన్నాడు. త్వరలో జరగనున్న వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా జడేజా ఎంపికయ్యాడు.