Virat Kohli : కోహ్లీ…2-3 నెలలు బ్రేక్ తీసుకో…

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు.

  • Written By:
  • Publish Date - January 27, 2022 / 11:54 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. కోహ్లీ శతకం సాధించి దాదాపు రెండేళ్ళు దాటిపోయింది. వరల్డ్ కప్ తర్వాత టీ ట్వంటీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడం… తర్వాత వన్డే సారథ్యం నుండి బీసీసీఐనే తప్పించడం జరిగాయి. అదే సమయంలో సఫారీ టూర్ లో టెస్ట్ సిరీస్ గెలవలేకపోవడంతో ఆ కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై చెప్పాడు. సారథ్య బాధ్యతలు వదిలేయడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాడని చాలా మంది భావించారు. వన్డే సిరీస్ లో హాఫ్ సెంచరీ చేసినా మునుపటి దూకుడు కనిపించలేదు. దీంతో కోహ్లీకి ఏమైందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా స్పందించిన మాజీ కోచ్ రవిశాస్తి విరాట్ కు కీలక సలహా ఇచ్చాడు. రెండు, మూడు నెలలు ఆట నుండి బ్రేక్ తీసుకోవాలని సూచించాడు. విశ్రాంతి తర్వాత రిఫ్రెష్ అయ్యి కింగ్ లాగా మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాలని కోహ్లీకి సూచించాడు.పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూ లో శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.

విశ్రాంతి తీసుకోవడం కోహ్లీకి చాలా మంచిదని, వచ్చే మూడు, నాలుగేళ్ళు అద్భుతంగా ఆడే శక్తి తనకొస్తుందన్నాడు. చాలా రోజులుగా విరాట్ విరామం లేని క్రికెట్ ఆడుతున్నాడు. బిజీ షెడ్యూల్ తో పాటు బబూల్ లైఫ్ కూడా ఆటగాడి మానసిక స్థితిపై ఖచ్ఛితంగా ప్రభావం చూపిస్తుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతల ఒత్తిడి నుండి వైదొలిగాడు కనుక బ్యాటింగ్ మరింతగా దృష్టి సారిస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే ఒక బ్రేక్ మాత్రం ఇప్పుడు కోహ్లీకి ఖచ్చితంగా అవసరమని శాస్త్రి విశ్లేషించాడు. అతని నైపణ్యాన్ని ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. జట్టు కెప్టెన్ గా ఉన్నంత కాలం కోహ్లీ అద్భుతంగా నడిపించాడని, ప్రతీ కెప్టెన్ ఐసీసీ ట్రోఫీలు గెలవలేరని ఈ మాజీ కోచ్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుత ఫామ్ కోల్పోయినప్పటకీ బ్రేక్ తీసుకుని వస్తే మళ్ళీ మైదానంలో కింగ్ కోహ్లీని చూడడం ఖాయమని రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. వచ్చే కోహ్లీకి అత్యంత సన్నిహితుడైన రవిశాస్త్రి భారత జట్టు కోచ్ గా ఎంపికవడంలో విరాట్ దే కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు సందర్భాల్లో శాస్త్రిపై విమర్శలు వచ్చినా కోహ్లీ కారణంగానే ఆ పదవిలో కొనసాగాడు.