Site icon HashtagU Telugu

RaviShastry : ఇప్పటికీ నా దగ్గర ధోనీ ఫోన్ నంబర్ లేదు

Dhoni Ravi Shastry

Dhoni Ravi Shastry

వరల్డ్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశానికి రెండు ప్రపంచ కప్ లు అందించిన ఏకైక భారత్ కెప్టెన్. అన్నింటికీ మించి తీవ్ర ఒత్తిడిలో కూడా జట్టును కూల్ గా నడిపించే సారథి. ఈ ప్రత్యేకతే ధోనీ ని అత్యున్నత స్థానంలో నిలిపింది. తాజాగా టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి ధోనీ గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. మైదానంలో హుందాగా వ్యవహరించే ధోనీ లాంటి ప్లేయర్‌ని తాను ఎక్కడా ఇప్పటి వరకూ చూడలేదని కితాబిచ్చాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లోనూ ఓ బలహీనత ఉండేదని గుర్తు చేసుకున్నాడు. సచిన్ కూడా కొన్ని సందర్భాల్లో కోపం తెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయని, అయితే ధోనీకి మాత్రం ఆ బలహీనత లేదన్నాడు. అసలు కోపం ఎలా తెచ్చుకోవాలో కూడా ధోనీకి తెలియదనీ శాస్త్రి వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా ధోనీ గురించి మరో ఆసక్తి కరమైన విషయం రవి శాస్త్రి అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికీ ధోనీ ఫోన్ నంబర్ తన దగ్గర లేదన్నాడు. ధోనీ ఫోన్ నీ చాలా తక్కువగా ఉపయోగిస్తాడనీ చెప్పాడు. అతను అనుకుంటే చాలా రోజులు ఫోన్ కు దూరంగా ఉండగలుగుతాడని చెప్పుకొచ్చాడు. అందుకే అతని ఫోన్ నంబర్ తాను ఎప్పుడూ అడగలేదనీ శాస్త్రి తెలిపాడు. అటు కెప్టెన్సీ విషయంలో ధోనీకి సమీపంలో కూడా ఎవరూ లేరన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీతో పోల్చగల కెప్టెన్ మరెవరూ లేరని రవిశాస్త్రి పేర్కొన్నాడు. వరల్డ్ కప్ గెలిచినా , ఫస్ట్ మ్యాచ్ లోనే ఓడినా…సెంచరీ చేసినా…లేకపోతే డకౌట్ అయినా ఒకేలా ఉండడం ధోనీ లో మాత్రమే చూశానని శాస్త్రి ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.