Site icon HashtagU Telugu

Ireland Tour : త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు

Rahul Tripathi

Rahul Tripathi

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎంతో మంది యువ ఆటగాళ్లకు కలిసొచ్చింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ ప్లేయర్లు రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్‌ టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే ఉమ్రాన్ మాలిక్‌ సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపికవగా.. రాహుల్ త్రిపాఠిని ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు సెలెక్ట్ చేశారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో రాహుల్ త్రిపాఠి ప్రదర్శన చాలా మంది మాజీలను ఆకట్టుకుంది. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ కూడా చేరారు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే.. స్కోరు వేగం పెరుగుతుందని జోస్యం చెప్పారు.ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడతాంటూ ఆకాశానికెత్తాడు. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఇన్నింగ్స్‌ ఆడే విధానం చూడముచ్చటగా ఉంటుందని రాహుల్‌ త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు.

ఐపీఎల్‌ 2022లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రాహుల్‌ త్రిపాఠి 14 మ్యాచ్‌లలో కలిపి 413 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అత్యధిక పరుగులు చేసినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసినందుకు త్రిపాఠి ఆనందం వ్యక్తం చేశాడు. ఇది చాలా పెద్ద అవకాశమని, తన కల నిజమైందని సంతోషపడ్డాడు. ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా.. భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. జూన్ 26, 28న వరుసగా డబ్లిన్ వేదికగా భారత్‌ ఐర్లాండ్ తో రెండు టీ ట్వంటీలు ఆడనుంది.