IPL Glamour Ceremony: రష్మిక, తమన్నా.. ఓపెనింగ్ సెర్మనీకి మరింత గ్లామర్

ఐపీఎల్ 16వ సీజన్ కు ఇంకా వారం రోజులే సమయముంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీల సన్నాహాల్లో..

  • Written By:
  • Publish Date - March 23, 2023 / 06:23 PM IST

IPL 16వ సీజన్ కు ఇంకా వారం రోజులే సమయముంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీల సన్నాహాల్లో బిజీగా ఉంటే.. క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఎప్పటిలానే స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్స్ రెండు నెలలకు పైగా క్రికెట్ వినోదాన్ని అందించబోతున్నారు. మార్చి 31న జరగనున్న ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ సారి ఆరంభ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. కోవిడ్ కారణంగా గత రెండు సీజన్లలోనూ ఆరంభోత్సవం జరపలేదు. ఈ సారి కోవిడ్ ప్రభావం తగ్గిపోవడం, ఎప్పటిలానే హోం, ఎవే ఫార్మాట్లలో మ్యాచ్ లు జరగనుండడంతో ఓపెనింగ్ సెర్మనీని ఏర్పాటు చేస్తున్నారు. అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ఈ సారి ఓపెనింగ్ సెర్మనీలో టాలీవుడ్, బాలీవుడ్ గ్లామర్ (Glamour) డోస్ పెంచారు. ఆరంభ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు తమన్నా, రష్మిక మందన పెర్ఫార్మ్ చేయనున్నారు. వీరితో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన వుమెన్స్ IPL లో కూడా కియారా అద్వానీ, కృతిసనన్, పంజాబీ పాప్ సింగ్ థిలాన్ తమ పెర్ఫార్మెన్స్ లతో అదరగొట్టారు. కాగా ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ వేడుకలకు మరికొందరు సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నట్టు సమాచారం. ఓపెనింగ్ సెర్మనీ మార్చి 31న రాత్రి 7.30 గంటలకు జరగనుండగా.. ఒక గంట ఆలస్యంగా మ్యాచ్ ఆరంభం కానుంది. దీని కోసం అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో బీసీసీఐ ఏర్పాట్లలో నిమగ్నమైంది. దాదాపు 1 లక్షా 32 వేల మంది సామర్థ్యం ఉన్న స్టేడియం కావడంతో ఎక్కువ మంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుంది. మార్చి 31 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ సీజన్ లో మొత్తం 10 జట్లు ఆడనుండగా.. 52 రోజుల పాటు 70 మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి.

Also Read:  Data Stolen: దేశంలోనే అతి పెద్ద డేటా స్కామ్!.. 16.80 కోట్ల మంది డేటా భారీగా చోరీ..