Site icon HashtagU Telugu

IPL closing ceremony: ముగింపు వేడుకలు అదిరె..

closing ceremony

closing ceremony

ఐపీఎల్ 15వ సీజన్‌ ఫైనల్‌కు ముందు ముగింపు వేడుకలు దుమ్మురేపాయి. చాలా కాలంగా వేడుకలను రద్దు చేస్తున్న బీసీసీఐ ఈ సారి మాత్రం అభిమానులను అలరించడమే లక్ష్యంగా క్లోజింగ్ సెర్మనీని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఘనత సాధించిన నరేంద్రమోదీ స్టేడియంలో అట్టహాసంగా ముగింపు వేడుకలు జరిగాయి. బాలీవుడ్ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌, మ్యూజిక్‌ లెజెండ్‌ ఏఆర్‌ రెహమాన్‌ ప్రదర్శనలతో నరేంద్ర మోదీ స్టేడియం దద్దరిల్లింది. ఇద్దరూ రెండు డిఫరెంట్‌ థీమ్స్‌తో వచ్చి అభిమానులను ఎంటర్‌టైన్ చేశారు. ముగింపు వేడుకల్లో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. క్లోజింగ్ సెర్మనీ వేడుకలకు ముందు ఓ భారీ జెర్సీని ఆవిష్కరించిన ఐపీఎల్ నిర్వాహకులు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించారు. ఈ రికార్డుకు సంబంధించిన పత్రాలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, సెక్రటరీ జే షా, ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌లకు గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకులు అందజేశారు. ఆ తర్వాత ఐపీఎల్‌ 2022 ట్రోఫీని ఆవిష్కరణ జరిగింది.

ముగింపు వేడుకల్లో ముందు నుంచీ అనుకున్నట్టుగానే రణ్‌వీర్‌సింగ్, ఎఆర్‌ రెహమాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందు ఎంట్రీ ఇచ్చిన రణ్‌వీర్‌సింగ్ ఐపీఎల్‌లో ఆడిన పది జట్లకు వినూత్న రీతిలో ట్రిబ్యూట్ ఇచ్చాడు. ఒక్కో టీమ్‌కు ఒక్కో పాట ఎంచుకొని తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు వచ్చేసరికి ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాటకు అతడు డ్యాన్స్‌ చేయడం ఆకట్టుకుంది. ఇక రణ్‌వీర్ తర్వాత మ్యూజిక్‌ లెజెండ్‌, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్‌ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. దేశం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న సందర్భంగా 75 ఏళ్ల భారత క్రికెట్‌ను గుర్తు చేసుకుంటూ రెహమాన్‌ తన పాటలతో అలరించాడు. ఈ సందర్భంగా తన హిట్ సాంగ్స్‌ వందేమాతరం, సడ్డా హక్‌, జయహో, రంగ్‌ దే బసంతిలాంటి పాటలతో రెహమాన్‌ అదరగొట్టాడు. దాదాపు లక్షా పాతికవేలకు పైగా ప్రేక్షకులతో నిండిపోయిన స్టేడియం రణ్‌వీర్‌సింగ్, రెహమాన్ ప్రదర్శనలతో హోరెత్తిపోయింద.