Site icon HashtagU Telugu

Rajasthan: విజయంతో సీజన్ ముగించిన రాజస్థాన్.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌ చిత్తు!

Rajasthan

Rajasthan

Rajasthan: ఢిల్లీ వేదిక‌గా ఐపీఎల్ 2025లో జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 187 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాజస్థాన్ (Rajasthan) 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రాజస్థాన్ తరపున వైభవ్ సూర్యవంశీ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. యశస్వీ జైస్వాల్ 36, సంజూ శాంసన్ 41 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ IPL 2025 ప్ర‌యాణం ముగిసింది. జట్టు 14 మ్యాచ్‌లలో 4 విజయాలతో సీజన్‌ను ముగించింది.

రాజస్థాన్ రాయల్స్‌కు 188 పరుగుల లక్ష్యం లభించింది. దీనికి సమాధానంగా జట్టు చాలా బాగా ఆరంభించింది. యశస్వీ జైస్వాల్ 19 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో వికెట్‌కు సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ మధ్య 98 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం నెల‌కొల్పారు. శాంస‌న్‌ 31 బంతుల్లో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. శాంస‌న్ ఔటయ్యే సమయంలో రాజస్థాన్‌కు గెలవడానికి ఇంకా 53 పరుగులు అవసరమయ్యాయి. శాంస‌న్ ఔటైన తర్వాత రాజస్థాన్ వైభవ్ సూర్యవంశీ కూడా 57 పరుగుల వ‌ద్ద ఔటయ్యాడు.

ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన రియాన్ పరాగ్ మ‌రోసారి నిరాశ‌ప‌ర్చాడు. అతను 4 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మయర్ రాజస్థాన్ విజయాన్ని ఖాయం చేశారు. జురెల్ 12 బంతుల్లో 31 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు.అదే సమయంలో హెట్మయర్ 5 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Also Read: Corona Case: అల‌ర్ట్‌.. మూడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!

CSK 10వ ఓటమి

ఇది IPL 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌కు 10వ ఓటమి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. ఈ జట్టు ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో ఉంది. చెన్నై తరపున ఆయుష్ మ్హాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ వరుసగా 43, 42 పరుగులతో వేగవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. కానీ తమ జట్టు విజయాన్ని నిర్ధారించలేకపోయారు. మరోవైపు ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు 8 పాయింట్లతో పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.