Site icon HashtagU Telugu

RR vs PBKS: బట్లర్ లేకుండానే బరిలోకి.. రాజస్థాన్ రాయల్స్‌ లో మైనస్ అదే

RR vs PBKS

RR vs PBKS

RR vs PBKS: గౌహతి వేదికగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. రాజస్థాన్ మైదానం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం అయినప్పటికీ, గౌహతి రెండవ హోమ్ గ్రౌండ్ . అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ ఆడలేదు. కాగా రాజస్థాన్ ఆడబోయే మిగిలిన రెండు మ్యాచ్ లను ఈ స్టేడియంలోనే ఆడనుంది. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టు 12 మ్యాచ్‌లు ఆడగా 4 మాత్రమే గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్ రేసుకు దూరమైంది. రాజస్థాన్ జట్టు ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది, కానీ అధికారిక ప్లేఆఫ్‌కు ఇంకా అర్హత సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలని భావిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇప్పటివరకు 27 ఐపిఎల్ మ్యాచ్‌లు జరిగాయి, అందులో రాజస్థాన్ రాయల్స్ 16 మ్యాచ్‌లు గెలిచింది. కాగా పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అంటే ఇక్కడ చూస్తే రాజస్థాన్‌దే పైచేయి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగనుంది. గౌహతి మైదానం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. అయితే భారత్‌లోని ఇతర పిచ్‌ల మాదిరిగానే ఇక్కడ కూడా బ్యాట్స్‌మన్‌కు అనుకూలమైన పిచ్‌గా మారే అవకాశం ఉంది.161 పరుగుల సగటు స్కోరు ఉన్న ఈ వేదికపై ఇప్పటివరకు మొత్తం 7 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఐపీఎల్ రికార్డులను పరిశీలిస్తే బర్సపరా స్టేడియంలో ఇప్పటి వరకు 2 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా, అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండు సార్లు విజయం సాధించింది. కానీ పిచ్‌పై తేమ ఉండవచ్చు, ఇది రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ స్టేడియంలో 37 వేల 800 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది.

ఇకపోతే ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ప్లేఆఫ్ రేసులో ముందంజలో ఉన్న ఈ జట్టుకు 16 పాయింట్లు ఉన్నాయి. కాకపోతే రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్ ల్లో జొస్ బట్లర్ లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ దేశానికి తిరిగిరావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. దీంతో బట్లర్ జట్టుని వీడి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. వాస్తవానికి బట్లర్ లేకపోవడం ఆర్ఆర్ కు కాస్త నష్టం కలిగించే అంశమే అయినప్పటికీ జట్టులో మిగతా బ్యాటర్లు రాణిస్తే సరిపోతుంది. సంజు శాంసన్, జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జోరెల్, హిట్ మేయర్ లాంటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ తో ఆర్ఆర్ బలమైన జట్టుగా ప్రత్యర్థి టీంకు బలమైన పోటీనిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం పడాల్సిన అవసరం లేదు.

Also Read: Hyderabad: హైదరాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో కాల్పులు: దోషికి పదేళ్ల జైలుశిక్ష