RR vs LSG: రాహుల్, పూరన్ పోరాటం వృథా… లక్నోపై రాజస్థాన్ రాయల్స్ విజయం

ఐపీఎల్‌ 17 సీజన్‌లో మరో హైస్కోరింగ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది

RR vs LSG: ఐపీఎల్‌ 17 సీజన్‌లో మరో హైస్కోరింగ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌ త్వరగానే బట్లర్, జైశ్వాల్ వికెట్లు చేజార్చుకుంది. అయితే సంజూ శాంసన్, రియాన్ పరాగ్‌ దుమ్మురేపారు. లక్నో బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. రియాన్ పరాగ్ కేవలం 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 43 రన్స్ చేయగా..సంజూ శాంసన్‌ 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. చివర్లో ధృవ్‌ జురెల్ కూడా మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ 193 పరుగులు చసింది. లక్నో బౌలర్లలో నవీనుల్‌హక్ 2 , రవి బిష్ణోయ్ 1 వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యఛేదనలో లక్నో ఆరంభంలోనే తడబడింది. రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి 11 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. డికాక్ 4 , బదౌని 1 పరుగుకే ఔటవగా… పడిక్కల్ డకౌటయ్యాడు. ఈ దశలో కెఎల్ రాహుల్, దీపక్ హుడా ఆదుకున్నారు. రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా… ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హుడా 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. హుడా ఔటైన తర్వాత నికోలస్ పూరన్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. వీరిద్దరి మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే సందీప్‌శర్మ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. డెత్ ఓవర్స్‌లో రాహుల్‌ వికెట్ తీయడంతో పాటు పూరన్‌ను భారీ షాట్లు కొట్టకుండా అడ్డుకోగలిగాడు. పూరన్ చివరి వరకూ పోరాడినప్పటకీ సందీప్‌శర్మ బౌలింగ్‌తోనే రాజస్థాన్ మ్యాచ్ గెలిచింది. పూరన్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. స్టోయినిస్‌ కూడా నిరాశపరచడం లక్నో ఓటమికి కారణమైంది. బౌల్ట్ 2 వికెట్లు తీయగా…సందీప్ శర్మ 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు.

Also Read: Deeparadhana: ఏ దేవుడికి ఎలా దీపారాధన చేయాలి.. ఎదురుగా దీపం పెడితే జరిగేది ఇదే?