Site icon HashtagU Telugu

KKR vs RR: ఈడెన్ లో బట్లర్ సూపర్ షో… కోల్ కత్తాపై రాజస్థాన్ అద్భుత విజయం

KKR vs RR

KKR vs RR

KKR vs RR: ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సునీల్ నరైన్ , బట్లర్ విధ్వంసకర శతకాలు ఈ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచాయి.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొట్టింది. ఓపెనర్ సాల్ట్ త్వరగానే ఔట్ అయినా…మరో ఓపెనర్ సునీల్ నరైన్ ఈడెన్ గార్డెన్స్ లో పరుగుల సునామీ సృష్టించాడు. భారీ షాట్లతో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న సునీల్‌.. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. రఘువంశీ, రింకూ సింగ్‌ కూడా మెరుపులు మెరిపించారు. దీంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. రాజస్తాన్‌ బౌలర్లలో అవేష్‌ఖాన్‌, కుల్దీప్‌ సేన్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. చాహల్‌, బౌల్ట్‌ తలా వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ , ఆవేశ్ ఖాన్ తప్పిస్తే మిగిలిన వారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

We’re now on WhatsAppClick to Join

భారీ లక్ష్య చేదనలో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడింది. అయితే పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ 19 , సంజూ శాంసన్ 12 పరుగులు చేశారు. అయితే రియాన్ పరాగ్, బట్లర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. రియాన్ పరాగ్ 34 రన్స్ కు ఔట్ అయ్యాక…రాజస్థాన్ వరుస వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో అశ్విన్ , హిట్ మెయర్ ను పెవిలియన్ కు పంపాడు. దాదాపు రాయల్స్ ఓటమి ఖాయమైన వేళ బట్లర్ , పోవల్ ధాటిగా ఆడి రాజస్థాన్ ను మళ్ళీ పోటీలోకి తెచ్చారు. ముఖ్యంగా పోవెల్ సునీల్ నరైన్ వేసిన 17వ ఓవర్లో వరుసగా 4, 6 ,6 బాదాడు. అదే ఓవర్లో పావెల్ ఔట్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో బట్లర్ రెచ్చిపోయాడు. మెరుపు షాట్లతో ఓడిపోయే మ్యాచ్ లో రాజస్థాన్ ను గెలిపించాడు. ఈ క్రమంలో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్ లో బట్లర్ కు ఇది రెండో శతకం. బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్లు , 6 సిక్సర్లతో 107 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ చివరి బంతికి టార్గెట్ అందుకుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా చివర్లో సర్కిల్ అవతల ఒక ఫీల్డర్ తక్కువగా ఉండడం కోల్ కత్తా ఓటమికి కారణమయింది.

Also Read: EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్