RR Beats CSK: చెపాక్ లో చెన్నైకి చెక్ పెట్టిన రాజస్థాన్

ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఓటమి ఎదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో చెన్నైని నిలువరించింది.

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 11:28 PM IST

RR Beats CSK: ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఓటమి ఎదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో చెన్నైని నిలువరించింది. ధోనీ, జడేజా చివర్లో భయపెట్టినా రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ చివరి ఓవర్ లో ఒత్తిడిని అధిగమించి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో సారథిగా తన 200వ మ్యాచ్ లో ధోనీకి నిరాశే మిగిలింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే యశస్వీ జైస్వాల్ ఔటయ్యాడు.తర్వాత దేవదత్ పడిక్కల్‌, జోస్ బట్లర్ రాజస్థాన్ ఇన్నింగ్స్ ను నడిపించారు. బట్లర్, పడిక్కల్ రెండో వికెట్ కు 77 పరుగులు జోడించారు. పడిక్కల్ 38 పరుగులకు ఔటవగా.. కెప్టెన్ సంజూ శాంసన్ మరోసారి డకౌటై నిరాశపరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బట్లర్ ధాటిగా ఆడాడు. అతను 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మొయిన్ అలీ తప్పిదంతో అశ్విన్ రనౌటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. అలాగే చెన్నై ఫీల్డర్లు పలు క్యాచ్ లు జారవిడవడం కూడా రాయల్స్ కు కలిసొచ్చింది. ఈ అవకాశాలతో చెలరేగిన అశ్విన్ భారీ సిక్సర్లు బాదాడు. ఆకాశ్ సింగ్ ఎట్టకేలకు అశ్విన్ 30 రన్స్ కు ఔట్ చేయగా.. బట్లర్‌ను మొయిన్ అలీ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత ధృవ్ జురెల్ , హోల్డర్ కూడా విఫలమవడంతో రాజస్థాన్ తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే చివర్లో హిట్ మెయిర్ మెరుపులు మెరిపించాడు. కేవలం 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో జడేజా , తుషార్ పాండే , ఆకాశ్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ 8 రన్స్ కే ఔటవగా.. రహానే, కాన్వే దూకుడుగా ఆడారు. రెండో వికెట్ కు 68 పరుగులు జోడించారు. మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రహానే 19 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అయితే మిడిలార్డర్ లో కీలక బ్యాటర్లు అందరూ నిరాశపరిచారు. రాజస్థాన్ స్పిన్నర్లు వరుస వికెట్లు పడగొట్టడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. మొయిన్ అలీ , ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అంబటి రాయుడు విఫలమవడంతో రాజస్థాన్ విజయం దిశగా సాగింది. అయితే రవీంద్ర జడేజా, ధోనీ చివర్లో భారీ షాట్లతో అదరగొట్టారు. ముఖ్యంగా ధోనీ భారీ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. చివరి ఓవర్లో విజయం కోసం 21 పరుగులు చేయాల్సి ఉండగా.. సందీప్ శర్మ రెండు వైడ్లు వేయడంతో చెన్నై విజయంపై ఆశలు నిలిచాయి. దానికి తగ్గట్టే ధోనీ వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో సమీకరణం మారిపోయింది. విజయం కోసం చివరి మూడు బంతుల్లో 7 పరరుగులు చేయాల్సి ఉండగా..మూడు సింగిల్స్ మాత్రమే రావడంతో రాజస్థాన్ 3 పరుగులతో మ్యాచ్ గెలిచింది. ధోనీ 32 , జడేజా 25 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.