RCB vs RR Qualifier 2: రాయల్స్ బ్యాటర్ల మెరుపులు.. ఎలిమినేటర్ లో బెంగళూరు ఔట్

ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. అద్భుతాలు చేస్తూ వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరును రాజస్థాన్ నిలువరించింది. ఎలిమినేటర్ లో 4 వికెట్ల తేడాతో ఓడించింది.

RCB vs RR Qualifier 2: ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. అద్భుతాలు చేస్తూ వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరును రాజస్థాన్ నిలువరించింది. ఎలిమినేటర్ లో 4 వికెట్ల తేడాతో ఓడించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓ మోస్తారు ఆరంభం లభించింది. ఓపెనర్లు డుప్లెసిస్ , కోహ్లీ తొలి వికెట్ కు 37 పరుగులు జోడించారు. కోహ్లీ 33 రన్స్ చేయగా…తర్వాత గ్రీన్ , రజత్ పటిదార్ ధాటిగా ఆడారు. అయితే రాజస్థాన్ స్పిన్నర్ల ఎంట్రీతో పరిస్థితి మారిపోయింది. వేగంగా పరుగులు చేసే క్రమంలో గ్రీన్ 27 , పటిదార్ 34 పరుగులకు వెనుదిరిగారు. భారీ అంచనాలు పెట్టుకున్న మాక్స్ వెల్ డకౌటవగా…దినేశ్ కార్తీక్ కూడా అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు. ఫలితంగా ఒత్తిడి పెరిగిన బెంగళూరు వరుస వికెట్లు చేజార్చుకుంది. అయితే లామ్రోర్ చివర్లో మెరుపులు మెరిపించాడు. కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 , అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.

173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు జైశ్వాల్ , టామ్ తొలి వికెట్ కు 5.3 ఓవర్లలో 46 పరుగులు జోడించారు. టామ్ ఔటైనా జైశ్వాల్ దూకుడుగా ఆడాడు. 20 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే జైశ్వాల్ , సంజూ శాంసన్ వెంటవెంటనే ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ధృవ్ జురెల్ నాలుగో వికెట్ గా వెనుదిరిగేటప్పటికీ విజయం కోసం రాజస్థాన్ 7 ఓవర్లలో 60 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో రియాన్ పరాగ్ , హెట్ మెయిర్ మెరుపులు మెరిపించారు. దూకుడుగా ఆడడంతో సాధించాల్సిన రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. చివర్లో రియాన్ పరాగ్ ను సిరాజ్ ఔట్ చేసినా అప్పటికే బంతికో పరుగు చేయాల్సి ఉండడంతో విజయం కోసం రాజస్థాన్ పెద్దగా శ్రమించలేదు. ఈ విజయంతో టోర్నీలో ఆశలు నిలుపుకున్న రాజస్థాన్ రెండో క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. మరోవైపు సెకండాఫ్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి ప్లే ఆఫ్ కు చేరిన ఆర్సీబీ ఎలిమినేషన్ మ్యాచ్ లో ఓడిపోవడం ఆ జట్టు ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చింది.

Also Read: AP : ఈసీకి జనసేన సూటి ప్రశ్న..డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చడం లేదు