Site icon HashtagU Telugu

Rajasthan Wins: ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్

Trent Boult

Trent Boult

ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. కీలకమైన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసి తమ ప్లేఆఫ్స్‌ ఆశలను మరింత మెరుగుపరచుకుంది.

లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌ ప్లేఆఫ్స్‌కు ముందు తడబడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో 24 రన్స్‌ తేడాతో పరాజయం పాలైన ఆ టీమ్‌.. మూడోస్థానానికి దిగజారింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ స్కోరు 11 పరుగుల దగ్గరే జోస్‌ బట్లర్ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత యశస్వి జైస్వాల్‌, కెప్టెన్‌ సంజు శాంసన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. బ్యాటింగ్‌కు అనుకూలించే బ్రాబౌర్న్‌ పిచ్‌పై 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 41 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో అశ్విన్‌ (10), బౌల్ట్‌ (18) కాస్త ఫైట్‌ చేయడంతో రాయల్స్‌ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ను మూడో ఓవర్లోనే ట్రెంట్ బౌల్ట్ కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ ఓవర్లో రెండు వరుస బాల్స్లో ఓపెనర్ క్వింటన్ డీకాక్ , ఆయుష్ బదోనీ వికెట్లు తీశాడు. రాహుల్ కూడా నిరాశ పరిచడంతో లక్నో 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతోపాటు లక్నోకు విజయంపై ఆశలు రేకెత్తించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 65 రన్స్ జోడించారు. ఆ తర్వాత కృనాల్ , కాసేపటికే హుడా కూడా ఔటవడంతో లక్నో విజయంపై ఆశలు వదులుకుంది. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో రాజస్థాన్ రెండోస్థానానికి దూసుకెళ్లింది.