Site icon HashtagU Telugu

Raj Bawa: యువీతో రాజ్‌బవాకు ఉన్న లింకేంటి ?

Raj Bawa

Raj Bawa

అండర్ 19 క్రికెట్‌లో మనకు తిరుగులేదని నిరూపిస్తూ భారత ఐదోసారి ప్రపంచకప్ గెలిచింది. ఈ ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ ఆల్‌రౌండర్ రాజ్ బవా ఇప్పుడు హీరో అయిపోయాడు. ఫైనల్లో 5 వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ రాణించి జట్టును గెలిపించిన బవా గురించి అభిమానులు విపరీతంగా ఆరా తీస్తున్నారు. ఇతను బ్యాక్‌ గ్రౌండ్ ఏంటి.. ఎక్కడ నుండి వచ్చాడు.. వంటి విషయాలపై సెర్చ్ చేస్తున్నారు. తాజాగా రాజ్ బవా గురించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. రాజ్ బవా తండ్రి సుఖ్విందర్ బవా.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్‌ యువరాజ్ సింగ్‌కు కోచ్‌గా వ్యవహరించాడన్న విషయం తెలిసింది. సుఖ్విందర్ పర్యవేక్షణలో యువరాజ్‌ 2000 అండర్‌ 19 ప్రపంచకప్‌ లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. తాజాగా రాజ్ బవా ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాలను షేర్ చేస్తున్నారు.

కాగా రాజ్‌బవా కుటుంబానికి క్రీడారంగంతోనే ఎక్కువ రిలేషన్ ఉంది. రాజ్ బవా తాత సర్దార్ తర్లోచన్ సింగ్ బవా హాకీ ప్లేయర్. 1948 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో తర్లోచన్ సింగ్ బవా, సభ్యుడిగా ఉన్నాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి స్వర్ణం గెలవడం… ఇప్పుడు ఆయన మనవడు రాజ్ బవా కూడా ఫైనల్లో ఇంగ్లండ్‌పైనే చెలరేగి టీమిండియాకు అండర్-19 వరల్డ్‌కప్ అందించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ యువ ఆల్‌రౌండర్ కేవలం ఫైనల్లోనే కాదు ఓవరాల్‌ టోర్నీలో అదరగొట్టాడు. 6 వన్డేల్లో 9 వికెట్ల తీయడంతో పాటు 252 పరుగులు చేసి ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటాడు. సౌతాఫ్రికాపై 4 వికెట్లు, ఉగాండా 108 బంతుల్లో 162 పరుగులు చేశాడు. ఇక ఫైనల్లో 5 వికెట్లతో అతని అద్భుత ప్రదర్శనపై పలువురు మాజీ ఆటగాళ్ళు ప్రశంసలు కురిపించారు.

Exit mobile version