Site icon HashtagU Telugu

IPL2022: రైనా ను వెనక్కి పిలవండి

98

98

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్‌ ఓటములని చవి చూసింది తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, తాజాగా పంజాబ్ కింగ్స్ చేతుల్లో పరాభవం పొందింది. ఈ సీజన్ ఆరంభానికి ముందు ఎంఎస్ ధోనీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు రవీంద్ర జడేజా.. కానీ చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజా దారుణంగా విఫలమవుతున్నాడు. సరైన సారథి లేకపోవడంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోను చెన్నై జట్టు ఓటములను చవిచూసింది.

ఈ క్రమంలో ఇప్పుడు సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. టాపార్డర్ బ్యాటర్ సురేష్ రైనాను మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. రైనా జట్టులో లేకపోవడంతోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో వరుస ఓటములను చవిచూస్తుందని పేర్కొంటున్నారు. ఇక ఐపీఎల్‌ వేలంలో అన్ సోల్డ్ జాబితాలో మిగిలిపోయిన సురేశ్‌ రైనా ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ లో రైనా వ్యక్తిగత కారణాలతో దూరమైన విషయం తెలిసిందే. దాంతో ఆ సీజన్‌లో చెన్నై చెత్త ప్రదర్శన కనబరిచింది. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో సురేష్ రైనా తిరిగి జట్టులోకి రావడంతో సీఎస్‌కే టైటిల్ విజేతగా నిలిచింది.

ఈ నేపథ్యంలో సురేష్ రైనాను తీసుకురావాలని అభిమానులు కోరుతున్నారు. ఇదిలాఉంటే.. సురేష్ రైనా ఐపీఎల్​లో 5వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున 176 మ్యాచ్​లు ఆడిన సురేశ్​ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 33 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్​లో మొత్తం 205 మ్యాచ్​లు ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు.