Rain Threat: భారత్- న్యూజిలాండ్ రెండో వన్డే డౌటే..!

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్.

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 04:44 PM IST

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. హామిల్టన్ వేదికగా ఆదివారం ఇండియా న్యూజిలాండ్ రెండో వన్డే జరగనున్న విషయం తెలిసిందే. అయితే రేపు అక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. హామిల్టన్ లో ఆదివారం వర్షం కురిసే అవకాశాలు 91 శాతం ఉన్నాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. దీంతో మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత్ ఘోర పరాభవం చెందింది. దీంతో రెండో వన్డేలో అయినా గెలిచి, ఎలాగైనా సిరీస్ ను సమం చేయాలనుకుంటున్న టీమిండియా ఆశలకు వర్షం ఆటంకం కలిగించేలా ఉంది.

హామిల్టన్ వేదికగా ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. మరోవైపు ఈ వార్త క్రికెట్ అభిమానులను కూడా చాలా నిరాశకు గురి చేస్తుంది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత సెడాన్ పార్క్‌లో టీమిండియా రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తుందని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆదివారం అక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆతిథ్య కివీస్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. రెండో మ్యాచ్ ఆదివారం ఉదయం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది.

హామిల్టన్‌లో ఆదివారం మధ్యాహ్నం దాదాపు నాలుగు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ తెలిపింది. అంటే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన టాస్ కూడా ఆలస్యం కావచ్చు. T20 సిరీస్‌లో కూడా ఇలాంటిదే కనిపించింది. మొదటి మ్యాచ్ వర్షం పడి రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందగా.. చివరి మ్యాచ్ వర్షం కారణంగా టై అయింది. ఇటీవల జరిగిన మొదటి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే.