Ind Vs SA 2nd T20: నేడు భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20.. మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు..?

సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా నేడు (ఆదివారం) గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది.

  • Written By:
  • Publish Date - October 2, 2022 / 11:36 AM IST

సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా నేడు (ఆదివారం) గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంత‌పురంలో జరిగిన తొలి టీ20లో భార‌త్ 8 వికెట్ల‌తో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే తొలి టీ20లో ఓడిన సౌతాఫ్రికా జ‌ట్టు రెండో టీ20లో విజ‌యం సాధించాల‌ని చూస్తోంది.

ఇక‌.. నేడు జరగబోయే గౌహతిలోని స్టేడియంలో టీమిండియా ఒక్క టీ20నే ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో కూడా భారత్ 118 పరుగులకే కుప్పకూలింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ విజ‌యం సాధించింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా ర‌ద్దైంది. అయితే.. నేడు జరగబోయే మ్యాచ్‍కు కూడా వ‌ర్షం అడ్డు ప‌డే అవ‌కాశ‌ముంది. ఈ స్టేడియంలోని పిచ్ మాత్రం బౌలర్లకు అనుకూలిస్తుంది. ఈ మైదానంలో భారీ స్కోర్లు చేసే అవ‌కాశం త‌క్కువ‌. ఈ స్టేడియంలో దాదాపు 39,000 మంది మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది.

స్వదేశంలో ఆడిన ప్ర‌తి మ్యాచ్‌కు ప్రతి స్టేడియం నిండిపోయింది. ఇది చాలా గొప్ప విషయం అని టీమిండియా కోచ్‌ ద్రవిడ్ అన్నారు. స్థానిక‌ వాతావరణ కేంద్రం నివేదిక ప్ర‌కారం.. ఆదివారం గౌహతిలో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా వర్షం వచ్చినప్పుడు సమయ నష్టాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే.. వ‌ర్షం నీరు లేదా తేమ పిచ్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశామ‌ని ACA కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.