SRH Beats Punjab Kings: సన్ రైజర్స్ గెలిచిందోచ్… పంజాబ్ కింగ్స్ పై ఘనవిజయం

ఐపీఎల్ 16వ సీజన్ లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. పేలవ ఫామ్ నుంచి బయటపడుతూ సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది

  • Written By:
  • Publish Date - April 9, 2023 / 11:12 PM IST

SRH Beats Punjab Kings: ఐపీఎల్ 16వ సీజన్ లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. పేలవ ఫామ్ నుంచి బయటపడుతూ సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో సత్తా చాటిన సన్ రైజర్స్ తొలి విజయాన్ని రుచి చూసింది.

పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ను సన్ రైజర్స్ బౌలర్లు హడలెత్తించారు. పేసర్లు మార్కో జెన్సన్, భువనేశ్వర్ టాపార్డర్ ను దెబ్బతీస్తే.. సన్ రైజర్స్ తరపున అరంగేట్రం చేసిన స్పిన్నర్ మయాంక్ మర్కాండే తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. ఫలితంగా పంజాబ్ 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ పోరాడే స్కోరు సాధించగలిగింది. ఒకవైపు సహచర బ్యాటర్లు ఔటవుతుంటే.. ఎక్కువ సేపు నాన్ స్ట్రైకింగ్ కే పరిమితమైన ధావన్ చివర్లో చెలరేగి ఆడాడు. హాఫ్ సెంచరీ వరకూ ధావన్ కు ఎక్కువ స్ట్రైకింగ్ అవకాశం రాలేదు.

అయితే 9 వికెట్ పడిన తర్వాత మెరుపులు మెరిపించాడు. భారీ షాట్లతో స్కోరును 140 దాటించాడు. 10వ వికెట్ కు అజేయంగా 55 పరుగులు జోడించాడు. చివరి 5 ఓవర్లలోనే 55 రన్స్ పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ధావన్ 66 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటకీ.. చివర్లో మూడు బాల్స్ డాట్ ఆడడం వల్ల తృటిలో శతకం చేజార్చుకున్నాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్ మర్కాండే 4 , ఉమ్రాన్ మాలిక్ 2 , జెన్సన్ 2 , భువనేశ్వర్ 1 వికెట్ పడగొట్టారు.

పెద్ద టార్గెట్ కాకపోయినప్పటకీ పేలవ ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ ఎలా ఆడుతుందో అన్న అనుమానం నెలకొంది. ఓపెనర్ గా వచ్చిన హ్యారీ బ్రూక్ 13 పరుగులకే ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో రాహుల్ త్రిపాఠీ దుమ్మురేపాడు. మయాంక్ అగర్వాల్ 21 రన్స్ కు ఔటైనప్పటకీ.. కెప్టెన్ మర్క్ రమ్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పాడు. దూకుడుగా ఆడుతూ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోకుండా చూసాడు. అటు మర్క్ రమ్ కూడా చక్కని సపోర్ట్ ఇవ్వడంలో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు త్రిపాఠి. పంజాబ్ ఫీల్డింగ్ తప్పిదాలు కూడా సన్ రైజర్స్ కు కలిసొచ్చాయి.

మర్క్ రమ్ , త్రిపాఠీ మూడో వికెట్ కు అజేయంగా 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో సన్ రైజర్స్ 17.1 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. త్రిపాఠీ 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 నాటౌట్ , మర్క్ రమ్ 21 బంతుల్లో 6 ఫోర్లతో 37 నాటౌట్ గా నిలిచారు.ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు ఇదే తొలి విజయం కాగా పంజాబ్ కు తొలి ఓటమి.