Rahul Tripathi: నా కష్టానికి ఫలితం దక్కింది

ఐపీఎల్‌లో సత్తా చాటి నేరుగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్న యువక్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 06:25 AM IST

ఐపీఎల్‌లో సత్తా చాటి నేరుగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్న యువక్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. తమ నైపుణ్యాన్ని సెలక్టర్ల ముందు ఉంచేందుకు ఐపీఎల్ కంటే గొప్ప అవకాశం యువక్రికెటర్లకు మరొకటి లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. ఐపీఎల్ 15వ సీజన్‌లో పరుగుల వరద పారించిన రాహుల్ త్రిపాఠీ తొలిసారి సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ ట్వంటీల సిరీస్‌కు త్రిపాఠీ ఎంపికయ్యాడు. చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న రాహుల్ త్రిపాఠీ కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం ఐపీఎల్ అనడంలో సందేహమే లేదు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన త్రిపాఛీ 413 పరుగులు సాధించాడు. దాదాపు దశాబ్ద కాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న త్రిపాఠీ ఎటాకింగ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

కాగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికవడంపై త్రిపాఠీ స్పందించాడు. తన కల నెరవేరిందని, కష్టానికి తగ్గ ఫలితం లభించిందని వ్యాఖ్యానించాడు. జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేసేందుకు ఈ సిరీస్ తమకు మంచి అవకాశంగా చెప్పుకొచ్చాడు. తన ఆటతీరును గుర్తించి ఎంపిక చేసిన సెలక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాజు. తుది జట్టులో అవకాశం లభిస్తే తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని త్రిపాఠీ చెప్పాడు. 31 ఏళ్ళ రాహుల్ త్రిపాఠీ 2017లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ తరపున నిలకడగా రాణించి వెలుగులోకి వచ్చాడు. తర్వాతి సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు.ఐపీఎల్ 15వ సీజన్‌లో త్రిపాఠీ 158.4 స్ట్రైక్‌రేట్‌తో 413 పరుగులు చేయడం ద్వారా తన సత్తా నిరూపించుకున్నాడు. తన ఎటాకింగ్ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌కు మంచి స్కోర్లు అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలోని భారత్ జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ ట్వంటీలు ఆడనుంది. భువనేశ్వర్‌ ఈ సిరీస్‌లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా..రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లకు విశ్రాంతినిచ్చారు.