Site icon HashtagU Telugu

Rahul Dravid : మిడిల్ ఓవర్ల వైఫల్యమే కొంపముంచింది : ద్రావిడ్

BCCI Invites Applications

BCCI Invites Applications

సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత వన్డే సిరీస్ అయినా గెలుస్తుందని భారత అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ప్రత్యర్థి జట్టుతో పోలిస్తే బలంగా కనిపించడంతో అంచనాలు పెరిగాయి. అయితే మైదానంలోకి వచ్చిన తర్వాత అంతా తలకిందులైంది. ఒక్క మ్యాచ్ లోనూ స్థాయికి తగినట్టు ఆడలేకపోయిన భారత్ 0-3 తో అవమానకర ఓటమి చవిచూసింది. తొలి రెండు వన్డేలతో పోలిస్తే కేప్ టౌన్ వన్డేలో పోరాడినప్పటకీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఆఈ మ్యాచ్ అనంతరం జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ తమ కళ్లు తెరిపించిందన్న ద్రావిడ్ ఓ మేలుకొలుపుగా అభివర్ణించాడు. వన్డే జట్టుతో ఇది తన మొదటి సిరీస్ అని, చాలా కాలం తర్వాత మేం వన్డేలు ఆడామన్నాడు. ప్రపంచ కప్ చాలా దూరంలో ఉండడంతో జట్టు కూర్పును సరిచేసుకునేందుకు సమయం ఉందని , క్రమేణా తాము ఖచ్చితంగా మెరుగుపడతామని ధీమా వ్యక్తం చేశాడు.

ఈ సిరీస్ లో ఓటమికి ద్రావిడ్ పలు కారణాలను విశ్లేషించాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించలేదన్నాడు. మధ్యలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న కొందరు జట్టుకు అందుబాటులో లేకపోవడం ప్రభావం చూపించిందన్నాడు. వారు తిరిగి జట్టులోకి వస్తే మిడిలార్డర్ బ్యాటింగ్ సమస్యలు తీరుతాయన్నాడు. దీపక్ చాహర్ ఇంతకు ముందు కూడా బ్యాటింగ్ సత్తా చూపించాడని గుర్తు చేశాడు. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నట్టు చెప్పాడు. శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాట్‌తో బాగా ఆకట్టుకున్నాడని, తమ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ప్రణాళికల్లో అతను ఉన్నాడని వెల్లడించాడు. తాము బ్యాటింగ్ ఆర్డర్‌ను పెద్దగా మార్చకపోవడం వెనుక కారణాలున్నాయని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. అవకాశాలు వచ్చినప్పుడు వారే మంచి ప్రదర్శనలు చేస్తారని, కొంచెం టైమ్ పడుతుందన్నాడు. కాగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం పెరగాలని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. దీనిపై మరింతగా దృష్టి పెడతామని చెప్పాడు. అటు కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నా ద్రావిడ్ మాత్రం మద్ధతుగా నిలిచాడు.. రాహుల్ కెప్టెన్‌గా నేర్చుకుంటూనే ఉన్నాడని, భవిష్యత్తులో మరింతగా రాటుదేలుతాడని అభిప్రాయపడ్డాడు.

Exit mobile version