Site icon HashtagU Telugu

VVS Laxman: కివీస్ టూర్‌కు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

National Cricket Academy

National Cricket Academy

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ సెమీస్‌లో నిష్క్రమించిన టీమిండియా వెంటనే మరో టూర్‌కు రెడీ అయింది. మూడు టీ ట్వంటీలు, మూడు వన్డేల కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళనుంది. ఈ టూర్‌కు పలువురు సీనియర్ ఆటగాళ్ళకు విశ్రాంతినివ్వగా.. హార్థిక్ పాండ్యా టీ ట్వంటీ జట్టుకు , శిఖర్ ధావన్ వన్డే సిరీస్‌లోనూ భారత్‌కు సారథ్యం వహించనున్నారు. కాగా సీనియర్ ప్లేయర్స్‌తో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కూడా కివీస్ టూర్ నుంచి విశ్రాంతినివ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ద్రావిడ్ స్థానంలో ఎన్‌సిఎ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గతంలోనూ ద్రావిడ్‌ స్థానంలో లక్ష్మణ్ పలు సిరీస్‌లకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఐర్లాండ్, జింబాబ్వే, సౌతాఫ్రికాలతో జరిగిన సిరీస్‌లు భారత్ లక్ష్మణ్ కోచింగ్‌లోనే ఆడింది. అటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ , బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా స్వదేశానికి తిరిగి రానున్నారు.

ప్రస్తుతం కివీస్ టూర్‌కు ఎంపికైన ఆటగాళ్ళు ఆస్ట్రేలియా నుంచే నేరుగా న్యూజిలాండ్ వెళ్ళనున్నారు. టీ ట్వంటీ సిరీస్‌ నవంబర్ 18 నుంచి జరగనుండగా.. వన్డే సిరీస్‌ వన్డే సిరీస్ నవంబర్ 25 నుంచి మొదలవుతుంది. టీ ట్వంటీ జట్టులో పలువురు యువక్రికెటర్లకు చోటు దక్కంది. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరించనుండగా.. కీపర్‌గా సంజూ శాంసన్‌కు కూడా చోటు దక్కింది. యువ ఆటగాళ్ళు ఇషాన్ కిషన్, గిల్, హుడా, కుల్దీప్ యాజవ్, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి వారు ఎంపికయ్యారు. అటు ధావన్ సారథ్యంలోని వన్డే జట్టుకు కూడా వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌నే ఎంపిక చేశారు.

Exit mobile version