Site icon HashtagU Telugu

Rahul Dravid: ఫినిషింగ్‌ రోల్‌ అతనిదే

Rahul Dravid

Rahul Dravid

దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్‌ కోసం వ్యూహరచనలో బిజీగా ఉన్న టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రీ ఎంట్రీ ఇచ్చిన హార్థిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌లపై ప్రశంసలు కురిపించాడు. గురువారం సౌతాఫ్రికాతో తొలి టీ20 జరగనున్న సందర్భంగా ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటన్స్‌కు టైటిల్‌ అందించిన హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌ కెప్టెన్సీ చాలా బాగుందని కితాబిచ్చాడు. వ్యక్తిగతంగా అతడు కూడా చాలా బాగా ఆడాడని ప్రశంసించాడు. హార్దిక్‌ మళ్లీ బౌలింగ్‌ చేస్తుండటం తమకు చాలా మంచిదని, ఇది టీమ్‌ను మరింత బలోపేతం చేసిందని చెప్పాడు. ఇక హార్దిక్‌కు టీమిండియా కెప్టెన్సీపై కూడా ద్రవిడ్‌ స్పందించాడు. ముందు ఓ క్రికెటర్‌గా అతనిలోని పూర్తి సామర్థ్యాన్ని రాబట్టుకోవడంపైనే దృష్టిసారించామని, కెప్టెన్సీ విషయం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని, దీనిపై సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని ద్రవిడ్‌ అన్నాడు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో భారత కెప్టెన్లు సక్సెస్‌ కావడంపై ద్రవిడ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. హార్దిక్‌తోపాటు రాహుల్‌, సంజు శాంసన్‌ కూడా సక్సెసయ్యారని చెప్పాడు. ఇది భారత్ క్రికెట్‌ భవిష్యత్తుగా మంచి పరిణామంగా ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. ఇక అందరూ చర్చించుకుంటున్న వెటరన్ వికెట్ కీపర్‌ దినేశ్ కార్తీక్‌పై ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌లో ఫినిషర్‌ రోల్‌ కోసమే అతన్ని ఎంపిక చేసినట్లు చెప్పాడు. గేమ్‌ చివర్లో అతడు చూపిన నైపుణ్యం ఆధారంగానే కార్తీక్‌ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడని తెలిపాడు.. గత రెండు, మూడేళ్లుగా అతడు నిలకడగా రాణిస్తున్నాడనీ, ఏ టీమ్‌కు ఆడినా తన ఉనికిని చాటుకున్నాడనీ గుర్తు చేశాడు. ఐపీఎల్‌లాగే భారత జట్టులోనూ అదే స్థానంలో కార్తీక్‌ను ఆడించనున్నట్టు ద్రావిడ్ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున కార్తీక్‌ 330 రన్స్‌ చేయడమే కాదు.. చివర్లో వచ్చి ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు టీమిండియా కొత్త స్పీడ్‌ గన్‌
ఉమ్రాన్‌ మాలిక్‌పై కూడా ద్రవిడ్‌ స్పందించాడు. అతన్ని తుది జట్టులోకి తీసుకుంటారా అని అడిగినప్పుడు.. ద్రవిడ్‌ స్పష్టంగా సమాధానమివ్వలేదు. అతడు నేర్చుకుంటున్నాడనీ, ఇంకా మెరుగవుతున్నాడని విశ్లేషించాడు. ఎంత ఆడితే అంత రాటుదేలుతాడనీ, అలాంటి వ్యక్తి టీమ్‌లో ఉండటం సంతోషంగా ఉందన్నాడు. అయితే అతనికి ఎన్ని ఛాన్స్‌లు ఇస్తామన్నది వేచి చూడాలని , అందరికీ తుది జట్టులో అవకాశం ఇవ్వడం కుదరదని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.