Rafael Nadal : నాదల్.. కింగ్ ఆఫ్ టెన్నిస్!

వయసు మీద పడింది... దీనికి తోడు వరుస గాయాలు... వాటి నుండి కోలుకున్నా వెంటాడిన ఫిట్‌నెస్ సమస్యలు... ఇంకేముందు క్లే కోర్ట్ కింగ్‌ రఫెల్ నాదల్ కెరీర్ ముగిసినట్టే.

  • Written By:
  • Updated On - January 31, 2022 / 11:31 AM IST

వయసు మీద పడింది… దీనికి తోడు వరుస గాయాలు… వాటి నుండి కోలుకున్నా వెంటాడిన ఫిట్‌నెస్ సమస్యలు… ఇంకేముందు క్లే కోర్ట్ కింగ్‌ రఫెల్ నాదల్ కెరీర్ ముగిసినట్టే.. ఏడాది క్రితం అతని గురించి వినిపించిన మాట… ఆ మాటలు నిజమైతే అతను నాదల్ ఎందుకవుతాడు… అన్ని సవాళ్ళనూ అధిగమిస్తూ తగ్గేదే లే అంటూ సమకాలిన టెన్నిస్‌లో శిఖరాగ్రాన నిలిచాడు. ప్రస్తుత తరంలో పురుషుల టెన్నిస్‌కు సంబంధించి దిగ్గజాలు ఎవరంటే ఫెదరర్ , జకోవిచ్ , నాదల్ పేర్లే వినిపిస్తాయి. గత ఏడాది వరకూ ఈ ముగ్గురూ సమానమే. వాళ్ళ వాళ్ళ కెరీర్‌లో 20 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్ళతో ఎవరికి వారే సాటి. అయితే ఇప్పుడు ఫెదరర్, జకోవిచ్‌లను వెనక్కి నెట్టేశాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయంతో టెన్నిస్‌లో సరికొత్త చరిత్రను లిఖించాడు. అత్యధిక గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్‌ను గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డ్ నాదల్‌కు అంత సులభం అందలేదు. చరిత్ర సృష్టించాలంటే ఒక్కోసారి టైమ్ పడుతుంది. ఆ టైమ్‌ రఫాకు ఇప్పుడు వచ్చింది. 2020 ఫ్రెంచ్ ఓపెన్‌తోనే 20వ గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న నాదల్‌కు మరో టైటిల్ గెలవడానికి ఏడాదికి పైగా పట్టింది. దీనికి కారణం వరుస గాయాలే. గాయాల నుండి కోలుకున్నా ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడాయి. ఫలితంగా గత ఏడాది మేజర్ టోర్నీల్లో నిరాశపరిచే ప్రదర్శనతో అతని కెరీర్ ముగిసిపోయిందనే అంతా భావించారు. అయితే వారి అంచనాలు తప్పని నిరూపిస్తూ ఫామ్‌లోకి వచ్చి 21వ గ్రాండ్‌శ్లామ్ అందుకున్నాడు.

నిజానికి ఆస్ట్రేలియన్ ఓపెన్ నాదల్‌కు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. 2009లో తొలిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన స్పెయిన్ మరో నాలుగు సార్లు ఫైనల్ చేరినా నిరాశే మిగిలింది. అలాంటి వేదికపై పోరాటాన్ని నమ్ముకున్న రఫా 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడే టైటిల్ గెలవడం ద్వారా సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. నిజానికి ఈ మ్యాచ్ ఎవరికైనా ఒక ఫైనల్ మాత్రమే.. నాదల్‌కు మాత్రం అంతకుమించి. టైటిల్ పోరును చూసిన వారు ఎవరైనా ఈ మాట అంగీకరించాల్సిందే. ఎందుకంటే నాదల్ పోరాటం అలా సాగింది మరి. తొలి రెండు సెట్లూ కోల్పోయి.. మూడో సెట్‌లో వెనుకబడిన తర్వాత రఫా పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. యోధులు చివరి వరకూ పోరాటపటిమను వదలరన్న గొప్ప వాక్యాన్ని నిజం చేస్తూ వరుసగా మూడు సెట్లు గెలిచి సిసలైన విజేతగా ట్రోఫీని ముద్దాడాడు. నాదల్ గెలిచింది ప్రత్యర్థి పై మాత్రమే కాదు తన సత్తా గురించి రేకెత్తిన సందేహాలపై…కెరీర్ ముగిసిందన్న విమర్శపై.. అన్నింటికీ మించి వరుస గాయాల, నిరాశ , నిస్పృహలపై గెలిచాడు. ఆట ఏదైనా… ప్రత్యర్థి ఎవరైనా విజయం కోసం చివరి వరకూ పోరాడాల్సిందేనని యువ ఆటగాళ్ళకు స్ఫూర్తిగా నిలిచిన నాదల్‌కు టెన్నిస్ ప్రపంచ సలాం చేస్తోంది.