PV Sindhu: సంపాదనలో దూసుకెళుతున్న సింధు

పివి సింధు.. భారత బ్యాడ్మింటన్ లో ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Written By:
  • Publish Date - December 23, 2022 / 01:57 PM IST

పివి సింధు.. భారత బ్యాడ్మింటన్ లో ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సైనా నెహ్వాల్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో అదరగొట్టింది. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టిన ఈ తెలుగు తేజం ఒలింపిక్స్ లోనూ డబుల్ ధమాకా సాధించింది. ఇక గ్రాండ్ ప్రీ, సూపర్ సిరీస్ వంటి విజయాలు చాలానే ఉన్నాయి. సింధు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తర్వాత ఆమె బ్రాండింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది. టాప్ కంపెనీలు ఆమెతో ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా అథ్లెట్లలో సింధు కూడా జెట్ స్పీడ్ గా దూసుకెళుతోంది.
ఫోర్బ్స్‌ ప్రతి ఏటా విడుదల చేసి చేసే అత్యధిక మొత్తం అందుకున్న మహిళా అథ్లెట్ల జాబితా టాప్‌ 25లో భారత్ నుంచి సింధుకు మాత్రమే చోటు దక్కింది. ఈ లిస్ట్ లో సింధు 12వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది సింధు సంపాదన 71 లక్షల డాలర్లు… భారత కరెన్సీలో దాదాపు 58 కోట్ల రూపాయలు. ప్రైజ్ మనీల కంటే తాను బ్రాండింగ్ చేస్తున్న కంపెనీల ద్వారానే సింధు ఎక్కువగా ఆర్జించింది. ఇదిలా ఉంటే టాప్‌ 25 జాబితాలో 12 మంది టెన్నిస్‌ ప్లేయర్సే ఉన్నారు. అత్యధిక సంపాదన ఉన్న మహిళా అథ్లెట్ల జాబితాలో నవోమి ఒసాకా టాప్‌లో ఉంది. ఆమె 2022లో ఏకంగా 5.11 కోట్ల డాలర్లు ఆర్జించింది. ఆమె తర్వాత 4.13 కోట్ల డాలర్లతో సెరెనా విలియమ్స్ రెండో స్థానంలో ఉంది. ఈ అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ 2022లో 4.13 కోట్ల డాలర్లు వెనకేసుకుంది. ప్రస్తుత టెన్నిస్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఇగా స్వియాటెక్‌ ఈ జాబితాలో ఐదోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన జిమ్నాస్ట్ సిమోన్‌ బైల్స్‌ కోటి డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో కొనసాగుతోంది.