Singapore Open: సింగపూర్ ఓపెన్ ఫైనల్లో సింధు

భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీ వీ సింధు అదరగొడుతోంది. ఈ సీజన్ లో ఫామ్ అందుకున్న సింధు తాజాగా సింగపూర్ ఓపెన్ ఫైనల్ కు దూసుకెళ్లింది.

  • Written By:
  • Publish Date - July 16, 2022 / 12:59 PM IST

భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీ వీ సింధు అదరగొడుతోంది. ఈ సీజన్ లో ఫామ్ అందుకున్న సింధు తాజాగా సింగపూర్ ఓపెన్ ఫైనల్ కు దూసుకెళ్లింది. జపాన్‌ ప్లేయర్ కవాకమితో జరిగిన సెమీస్‌లో 21-15, 21-7 తేడాతో విజయం సాధించింది. తక్కువ ర్యాంకు ప్రత్యర్థిని కేవలం 31 నిమిషాల్లోనే చిత్తు చేసింది. వీరిద్దరూ గతంలో తలపడిన రెండు మ్యాచుల్లోనూ తెలుగు తేజానిదే పైచేయిగా ఉంది. సెమీస్‌లోనూ ఆమె అదే జోరు ప్రదర్శించింది.

వరుస స్మాష్‌లతో చెలరేగింది. 24 ఏళ్ల కవాకమి తొలి గేమ్ లో మాత్రమే కాస్త పోటీ ఇచ్చినా…తర్వాతి గేమ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. షటిల్‌పై నియంత్రణ లేకపోవడంతో బాగా వెనకబడిపోయింది సింధు అదే పనిగా ర్యాలీలు ఆడించి ప్రత్యర్థిని దెబ్బతీసింది. చివరి వరకూ పూర్తి ఆధిపత్యం కొనసాగించిన సింధు 21-7తో గేమ్‌తో పాటు మ్యాచునూ ముగించింది. ఈ ఏడాది రెండు సూపర్‌ 300 టైటిల్స్‌ సయ్యద్‌ మోదీ, స్విస్‌ ఓపెన్‌ సాధించిన సింధు.. సింగపూర్‌ ఓపెన్‌ గెలిచి తొలి సూపర్‌ 500 టైటిల్‌ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. కెరీర్‌లో దాదాపు అన్ని సూపర్‌ 500 టైటిల్స్‌ సాధించిన సింధు సింగపూర్‌ ఓపెన్‌ మాత్రం గెలవలేకపోయింది.