Site icon HashtagU Telugu

Prabhsimran: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హ్యాట్రిక్ శతకాలు.. ప్రీతి పాప హ్యాపీ

Prabhsimran

Prabhsimran

Prabhsimran: ఐపీఎల్ కి ముందు స్వదేశీ లీగ్ లలో ఆటగాళ్లు అదరగొడుతున్నారు. సెంచరీలతో పోటీ పడుతూ ఫ్రాంచైజీ ఓనర్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (Prabhsimran) భారీ సెంచరీతో తెగబడ్డాడు. ఈ సెంచరీతో ప్రభసిమ్రాన్ సింగ్ విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ శతకాలు నమోదు చేశాడు.

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 105 బంతుల్లో 20 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు. ప్రభాసిమ్రన్ సెంచరీతో పాటు, కెప్టెన్ అభిషేక్ శర్మ (93), రమణదీప్ సింగ్ (80) అద్భుతమైన ఇన్నింగ్స్‌ల ఆధారంగా పంజాబ్ వరుసగా రెండో మ్యాచ్‌లో 400 పరుగులు చేసింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ మూడు రోజుల క్రితం నెలకొల్పిన 424 పరుగుల రికార్డును మళ్ళీ పంజాబే బద్దలు కొట్టింది. దీంతో పంజాబ్ వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా 400 పరుగుల మార్క్ ను అందుకుంది.

వచ్చే సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ప్రభాసిమ్రాన్ సింగ్ ను 4 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వరుస సెంచరీలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. హైదరాబాద్ పై 137, ముంబైపై 150, సౌరాష్ట్రపై 125 పరుగులతో వరుస సెంచరీలు బాదాడు. ఏదేమైనా ప్రభాసిమ్రాన్ సింగ్ ను నిలబెట్టుకున్నందుకు పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా గర్వపడుతుంది. మరోవైపు కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్ కూడా వరుసగా మూడు సెంచరీలు సాధించాడు.