Site icon HashtagU Telugu

Punjab Kings:కెప్టెన్ తొలగింపు వార్తలపై స్పందించిన పంజాబ్ కింగ్స్

Mayank Agarwal

Mayank Agarwal

‘పంజాబ్ కింగ్స్’ ఐపీఎల్ జట్టు నుంచి కెప్టెన్ మయాంక్ అగర్వాల్, కోచ్ అనిల్ కుంబ్లేను తొలగించనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం స్పందించింది. దీనిపై వివరణతో ప్రకటన విడుదల చేసింది.

‘‘పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కెప్టెన్సీకి సంబంధించి కొన్ని క్రీడా వెబ్ సైట్లలో వార్తలు ప్రచురితమయ్యాయి. ఇందుకు సంబంధించి ఫ్రాంచైజీ తరఫున ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని స్పష్టం చేస్తున్నాం’’ అని పంజాబ్ కింగ్స్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. కానీ, కెప్టెన్ ను మారుస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మాత్రం ఖండించలేదు. ఫ్రాంచైజీ తరఫున అధికారికంగా ఎవరూ దీని గురించి చెప్పలేదని మాత్రమే ప్రకటించడం అంటే కర్ర విరగలేదు, పాము చావలేదన్నట్టుగా ఉంది.

కేఎల్ రాహుల్ కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా వెళ్లిపోవడంతో, పంజాబ్ జట్టు కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ కు అవకాశం లభించడం తెలిసిందే. మయాంక్ ఫర్వాలేదనిపించాడే కానీ, జట్టును అంతిమ విజేతగా నిలబెట్టలేకపోయాడు. దీంతో అతడితోపాటు కోచ్ ను కూడా మార్చొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ట్రెవర్ బేలిస్, ఇయాన్ మోర్గాన్ లలో ఒకరిని కోచ్ గా తీసుకోవచ్చన్న వార్తలు కూడా వచ్చాయి.