Royal Challengers Bengaluru: ధర్మశాలలో కోహ్లీ మెరుపులు.. పంజాబ్‌ను చిత్తు చేసిన ఆర్‌సీబీ

ఐపీఎల్ 17వ సీజన్ సెకండాఫ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపుతోంది.

  • Written By:
  • Updated On - May 9, 2024 / 11:59 PM IST

Royal Challengers Bengaluru: ఐపీఎల్ 17వ సీజన్ సెకండాఫ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) దుమ్మురేపుతోంది. ఫస్టాఫ్‌లో వరుస ఓటములతో నిరాశపరిచిన ఆ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకుంది. తాజాగా ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసి ప్లే ఆఫ్ రేసును ఆసక్తికరంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే కోహ్లీ బ్యాటింగే… ఆరంభంలోనే డుప్లెసిస్ , విల్ జాక్స్ వికెట్లు కోల్పోయిన వేళ కోహ్లీ మాత్రం చెలరేగిపోయాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

అతనికి తోడు రజత్ పటిదార్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ముఖ్యంగా కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌ అభిమానులకు మంచి మజాను ఇచ్చింది. తన స్ట్రైక్‌ రేట్‌పై వస్తున్న విమర్శలకు ఈ మ్యాచ్‌లో ధీటుగా జవాబిచ్చాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 195కు పైగా స్ట్రైక్ రేట్‌తో 92 పరుగులు చేశాడు. అటు పటిదార్ కూడా 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. కోహ్లీ సెంచరీ చేజార్చుకున్నప్పటకీ.. చివర్లో గ్రీన్ 27 బంతుల్లోనే 46 , దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశారు. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 241 పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 , కావేరప్ప 2 వికెట్లు పడగొట్టారు.

Also Read: Health: ఖర్జూర తింటే ఇన్ని ఆరోగ్య లాభాలున్నాయా.. అవేంటో తెలుసుకోండి

భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు. అయితే జానీ బెయిర్ స్టో, రొస్కు భారీ షాట్లతో మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు పవన్ ప్లేలోనే 65 పరుగులు జోడించారు. బెయిర్ స్టో 27 రన్స్‌కు ఔటైనప్పటకీ.. రొస్కు, శశాంక్ సింగ్ దూకుడుగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది. అయితే బెంగళూరు బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ పై చేయి సాధించారు. రొస్కు 27 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాక… పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.

We’re now on WhatsApp : Click to Join

సామ్ కరన్ 22 పరుగులు చేసినా మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో ఓటమి ఖాయమైంది. చివరికి పంజాబ్ 181 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్ 2 , సిరాజ్ 3 , ఫెర్గ్యుసన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆర్‌సిబికి ఇది వరుసగా నాలుగో విజయం. తాజా గెలుపుతో ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకున్న బెంగళూరు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అలాగే భారీస్కోర్ సాధించడం ద్వారా రన్‌రేట్‌ను కూడా బాగా మెరుగుపరుచుకుంది.