Site icon HashtagU Telugu

PBKS Vs RR: హెట్ మెయిర్ మెరుపులు వృథా… రాయల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం

PBKS Team 2025 Player List

PBKS Team 2025 Player List

PBKS Vs RR: ఐపీఎల్ 16వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో పంజాబ్ 5 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు.

శిఖర్ ధావన్, ప్రభ్ సిమ్రాన్ భారీ షాట్లతో చెలరేగి ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 9.4 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. ముఖ్యంగా ధావన్ చూడచక్కని క్లాసిక్ షాట్లతో అలరించాడు. మరోవైపు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రభ్ సిమ్రాన్ కేవలం 34 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. అయితే భనుక రాజపక్స రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగినా… జితేశ్ శర్మ , ధావన్ జోరు కొనసాగించారు. చివర్లో రాజస్థాన్ కట్టడి చేసేందుకు ప్రయత్నించినా..ధావన్ క్రీజులో ఉండడంతో పంజాబ్ స్కోర్ 190 దాటింది.

చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన ధావన్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో హోల్డర్ 2 వికెట్లు, అశ్విన్, చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యఛేదనలో ఇన్నింగ్స్ తొలిబంతికే సిక్సర్ కొట్టాడు యశస్వి జైశ్వాల్. అయితే బట్లర్ ఫీల్డింగ్ సమయంలో స్వల్పంగా గాయపడడంతో ఓపెనర్ గా అశ్విన్ వచ్చాడు. అశ్విన్ డకౌటవగా.. కాసేపటికే జైశ్వాల్ 11 రన్స్ కే వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన బట్లర్ ధాటిగా ఆడినప్పటకీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 19 పరుగులకు అతను ఔటవగా.. సంజూ శాంసన్ ఆకట్టుకున్నాడు.

ఫామ్ కొనసాగిస్తూ ధాటిగా ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసాడు. కీలక సమయంలో సంజూ ఔటవడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. తర్వాత పడిక్కల్, రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరిలో పరాగ్ వేగంగా ఆడినప్పటకీ… పడిక్కల్ నిదానంగా ఆడడం ఆశ్చర్యపరిచింది. భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడడం కనిపించింది.

రియాన్ పరాగ్ 20 రన్స్ కు ఔటైన తర్వాత పంజాబ్ గెలుపు దిశగా సాగింది. పంజాబ్ బౌలర్ ఎలిస్ అద్భుతమైన బౌలింగ్ తో రాజస్థాన్ ను దెబ్బతీశాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ రాయల్స్ జోరుకు బ్రేక్ వేశాడు. తర్వాత పడిక్కల్ ఔటైనప్పటకీ.. హెట్ మెయిర్ , ధృవ్ భారీ షాట్లతో రెచ్చిపోయారు. వరుసగా మూడు ఓవర్లలోనూ కలిపి 53 పరుగులు చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.

చివరి ఓవర్ లో విజయం కోసం 16 పరుగులు చేయాల్సి ఉండగా… తొలి రెండు బంతులకు 3 పరుగులు వచ్చాయి. మూడో బంతికి హెట్ మెయిర్ రనౌటవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. హెట్ మెయిర్ 18 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. తర్వాత రెండు బంతులకూ శామ్ కరన్ కట్టడి చేయడంతో పంజాబ్ విజయం సాధించింది.