Site icon HashtagU Telugu

Prithvi Shaw: రాణిస్తున్న పృథ్వీ షా, పట్టించుకోని బీసీసీఐ

Prithvi Shaw

Prithvi Shaw

Prithvi Shaw: అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా చాలా కాలంగా టీమిండియాకు దూరమయ్యాడు. అయితే జట్టులో స్థానం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ తానేంటో నీరుపించుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌లో పటిష్ట ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఓ సిరీస్ లో భాగంగా పృథ్వీ షా నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడుతున్నాడు. ప్రత్యర్థి జట్టు మిడిల్‌సెక్స్‌పై తుఫాను ఇన్నింగ్స్ ఆడిన పృథ్వీ షా హాఫ్ సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో షా 58 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌ను సెంచరీగా మార్చే అవకాశం అతనికి లభించినా విఫలమయ్యాడు. 19వ ఓవర్ నాలుగో బంతికి అతను ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో పృద్వి షా కేవలం 33 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే దాంతర్వాత కాస్త నెమ్మదించి సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. పృథ్వీ షా ఇలాంటి ఇన్నింగ్స్ తన క్రికెట్ కెరీర్లో ఎన్నో ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండో భారత క్రికెటర్‌గా షా నిలిచాడు.

టెస్టుల్లో ఈ 24 ఏళ్ళ యువ బ్యాట్స్ మెన్ ట్రిపుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. అయినప్పటికీ కొన్ని వివాదాల కారణంగా జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో షా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో పృద్విషాను భవిష్యత్తు క్రికెటర్ గా భావించారు. కానీ గాయాలు మరియు పేలవమైన ఫామ్ కారణంగా అతను జట్టు నుండి తొలగించబడ్డాడు. తన కేరీర్లో భారత్ తరఫున ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 42.37 సగటుతో 339 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఆరు వన్డేల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు, అందులో 189 పరుగులు చేశాడు. టీమ్ ఇండియా తరఫున ఒకే టి20 మ్యాచ్ ఆడాడు, అందులో ఒక పరుగు చేసి ఔట్ అయ్యాడు.

ఐపిఎల్ మరియు దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ బీసీసీఐ పృద్విషా ప్రతిభను కన్సిడర్ చెయ్యట్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటిట్యూడ్ అతని పాలిట శాపంగా మారుతుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ప్రస్తుతం తాను పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టి ఒక్క ఛాన్స్ కోసం ఆరాటపడుతున్నాడు. ఇకనైనా బీసీసీఐ షా ను గుర్తించి అవకాశాలు కల్పిస్తే తానేంటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. విశేషం ఏంటంటే ఈ యువ ప్లేయర్ కి వయస్సు కేవలం 24 సంవత్సరాలే.

Also Read: CM Chandrababu: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష