Prithvi Shaw: పృథ్వీ షా దెబ్బకు 134 ఏళ్ల రికార్డు బ్రేక్

క్రికెట్ చరిత్రలో అద్భుతం చోటు చేసుకుంది. అది కూడా మన దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ లో సరికొత్త రికార్డు నమోదయింది.

  • Written By:
  • Publish Date - June 17, 2022 / 10:13 PM IST

క్రికెట్ చరిత్రలో అద్భుతం చోటు చేసుకుంది. అది కూడా మన దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ లో సరికొత్త రికార్డు నమోదయింది. ఈ అద్భుతం దెబ్బకు 134 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉన్న ఒక రికార్డు కూడా కనమరుగైపోయింది.
రంజీ ట్రోపీ 2022 సీజన్‌లో భాగంగా ముంబై, ఉత్తర్‌ ప్రదేశ్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ముంబై.. కెప్టెన్‌ పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్‌లు ఓపెనర్లుగా వచ్చారు. మ్యాచ్‌లో పృథ్వీ 71 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ విశేషమేమిటంటే పృథ్వీ షా 64 పరుగులు చేసి ఔటైనప్పుడు జట్టు స్కోరు 66. మరో ఓపెనర్‌ జైశ్వాల్‌ స్కోరు 0. దీనిని చూస్తే ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి. అవునండీ తొలి వికెట్‌ పడే సమయానికి జట్టు 66 పరుగులు చేయగా.. అందులో పృథ్వీ షావి 64 పరుగులు కాగా..మరో రెండు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.
తొలి వికెట్‌కు జైశ్వాల్‌తో 66 పరుగులు జోడించగా.. అందులో 96.96 శాతం పరుగులు పృథ్వీ షావే. తొలి వికెట్‌కు 50 ప్లస్‌ స్కోరు చేయడంలో ఒక్క బ్యాటర్‌దే స్కోరు మొత్తం ఉండడం ఫస్ట్‌క్లాస్‌ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1888లో ఆస్ట్రేలియా క్రికెట్‌లో జరిగింది. నార్త్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ పెర్సీ మెక్‌డోనెల్‌ అలెక్స్‌ బ్యానర్‌మెన్‌తో కలిసి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. అందులో పెర్సీ మెక్‌డోనెల్‌వి 95.34 శాతం పరుగులు. తాజాగా 134 ఏళ్ల అనంతరం పృథ్వీ షా-జైశ్వాల్‌ జోడి ఆ రికార్డును బద్దలు కొట్టింది. పృథ్వీ షా ఔటయ్యే సమయానికి 52 బంతులు ఆడిన జైశ్వాల్‌ ఒక్క పరుగు చేయలేదు.