Site icon HashtagU Telugu

Asia Cup 2023: ఆసియా సమరానికి అంతా రెడీ.. టైటిల్ ఫేవరెట్ గా టీమిండియా

Asia Cup 2023 Points Table

2023 Asia Cup Likely In Pakistan And One Other Overseas Venue For india games

Asia Cup 2023: ఆసియా దేశాల క్రికెట్ సంగ్రామానికి కౌంట్ డౌన్ మొదలయింది. పాకిస్థాన్ , శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్ (Asia Cup 2023) టోర్నీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని ఉపయోగించుకునేందుకు జట్లు సిద్ధమయ్యాయి. 1984లో మొదలయిన ఆసియా కప్ 2008 నుంచి మాత్రం ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. మొదట కేవలం వన్డే ఫార్మాట్లోనే ఈ టోర్నీ నిర్వహించేవాళ్లు. కానీ 2016 నుంచి ఐసీసీ ప్రపంచకప్‌లను దృష్టిలో పెట్టుకుని టీ20, వన్డేల్లో మార్చి మార్చి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్‌ జరగబోతుంది.

ఈ సారి ఆసియా కప్‌ మ్యాచ్‌లు పాకిస్థాన్‌, శ్రీలంకలో జరుగనున్నాయి. మ్యాచ్‌లాడేందుకు పాక్‌ వెళ్లేందుకు భారత్‌ నిరాకరించడంతో ఈ టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్‌ విధానంలో రెండు దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అధికారిక ఆతిథ్య హోదాలో ఉండే పాక్‌లో 4 మ్యాచ్‌లు, భారత్‌ ఆడే మ్యాచ్ లతో పాటు మరో 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్‌- ఎలో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌.. గ్రూప్‌- బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. మొదట ఒక్కో జట్టు గ్రూప్‌ దశలోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4 ఆడతాయి. సూపర్‌-4లో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో ఒక్క మ్యాచ్‌ ఆడుతుంది. టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌ చేరతాయి.

Also Read: JioCinema: జియో సినిమా సరికొత్త రికార్డు.. ఐపీఎల్ 2023 లైవ్ స్ట్రీమింగ్‌ని ఎంత మంది చూశారో తెలుసా..?

ఆసియా కప్‌లో భారత జట్టుదే ఆధిపత్యం. ఇప్పటి వరకూ ఏడు టైటిళ్లతో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఆరు సార్లు విజేతగా నిలిచిన శ్రీలంక రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్‌ రెండు సార్లు కప్ గెలిచింది. ఈ సారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ శ్రీలంకతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాయి. వన్డే ప్రపంచ కప్ కు ముందు తమ జట్టు కూర్పు పరిశీలించేందుకు ఆయా జట్లకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలి.. బౌలింగ్ కాంబినేషన్ పై మరింత క్లారిటీ తెచ్చుకునేందుకు భారత్ కు ఈ టోర్నీ కీలకం కానుంది.