Paralympics 2024: 2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో ప్రీతీ పాల్ 2వ పతకాన్ని గెలుచుకుంది. మహిళల 200 మీటర్ల టీ35 విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పారాలింపిక్స్‌లో ప్రీతి సాధించిన ఈ పతకం ద్వారా భారత్‌కు ఇప్పటివరకు 7 పతకాలు వచ్చాయి. ఈ ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రీతీ పాల్ కు అభినందనలు తెలిపారు.
ప్రధాని మోదీ అభినందనలు:
ప్రీతి పాల్ అభిరుచికి ప్రత్యక్ష నిదర్శనం.”ప్రీతీ పాల్ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మహిళల 200 మీటర్ల టి35 ఈవెంట్‌లో ప్రీతి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2024 పారాలింపిక్స్ లో ఆమెకు రెండో పతకం. భారతదేశ ప్రజలకు ఆమె స్ఫూర్తి. ఆమె అంకితభావం అమోఘం అని మోడీ ట్వీట్ చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము:
ప్రీతి పాల్ సాధించిన ఘనతను దేశ విజయంగా భావించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆమె సాధించిన విజయానికి ముర్ము అభినందనలు తెలిపారు.
ఆదివారం జరిగిన మహిళల 200 మీటర్ల టీ35 విభాగంలో ప్రీతి కాంస్యం సాధించింది. ఆమె 30.01 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో ఈ ఘనత సాధించింది. అంతకుముందు శుక్రవారం మహిళల 100 మీటర్ల T35 రేసులో ప్రీతి కాంస్యం గెలుచుకుంది, ఇది పారాలింపిక్ ట్రాక్ ఈవెంట్‌లో భారతదేశానికి మొదటి అథ్లెటిక్స్ పతకం. పారిస్ పారాలింపిక్స్ నాల్గవ రోజున భారతదేశం 2 పతకాలను గెలుచుకుంది. ప్రీతి కాంస్యం గెలుచుకోగా, హైజంప్‌లో నిషాద్ కుమార్ రజత పతకం సాధించారు. దీంతో భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రీతి చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇది మాత్రమే కాదు, కాళ్ళు అసాధారణ పరిస్థితి కారణంగా ఏళ్ల తరబడి చికిత్స తీసుకున్నా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ప్రీతి ఎనిమిదేళ్లుగా వాడే కాలిపర్‌ని ఐదేళ్ల వయసులో ధరించాల్సి వచ్చింది. కానీ ప్రీతికి క్రీడల్లో అభిరుచి ఉండటంతో చిన్న వయసులోనే శిక్షణ కోసం ఢిల్లీకి వచ్చింది. ఆపై తన కలను నిరవేర్చుకునేందుకు అంకితభావంతో ముందుకెళ్లింది. ఫలితంగా 2024 పారిస్ పారాలింపిక్స్ లో 2 పతకాలు సాధించి తన కుటుంబానికి మరియు దేశానికి కీర్తిని తెచ్చి పెట్టింది.
Also Read: Instant Glow Juices: మీరు అందంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే ఈ జ్యూస్‌లు తాగాల్సిందే..!