బంగ్లాదేశ్ (Bangladesh) తో మూడు టీ ట్వంటీల సిరీస్ (T20I) లో రెండో మ్యాచ్ బుధవారం జరగబోతోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. తొలి టీ ట్వంటీలో బంగ్లాను చిత్తు చేసిన భారత్ ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయి.
గత మ్యాచ్ లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ (Nitish Kumar Reddy, Mayank Yadav) అరంగేట్రం చేశారు. వీరిద్దరిలో నితీశ్ కుమార్ రెడ్డి పర్వాలేదనిపిస్తే… మయాంక్ యాదవ్ మాత్రం ఆకట్టుకున్నాడు. తొలి ఓవర్ నే మెయిడెన్ చేసిన మయాంక్ మంచి వేగంతో బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీశాడు. అయితే రెండో టీ ట్వంటీ కోసం భారత తుది జట్టులోకి మరో పేసర్ హర్షిత్ రాణా వచ్చే అవకాశముంది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున అద్భుతంగా రాణిస్తున్న హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తే నితీశ్ కుమార్ రెడ్డి బెంచ్ కే పరిమితం కాక తప్పదు.
మరోవైపు మిగిలిన కాంబినేషన్ లో మార్పులు జరిగే అవకాశం లేదు. పేస్ ఎటాక్ ను అర్షదీప్ సింగ్ లీడ్ చేయనుండగా… మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా బాధ్యతలు పంచుకుంటారు. అలాగే ఇద్దరు స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సందర్ కొనసాగనున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత టీ ట్వంటీ జట్టులోకి తిరిగి వచ్చిన వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్ లో సత్తా చాటాడు. దీంతో రవి బిష్ణోయ్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేనట్టే.
ఇక బ్యాటింగ్ విభాగంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా… సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్ , హార్థిక్ పాండ్యా, రింకూ సింగ్ వరుసగా రానున్నారు. గత మ్యాచ్ లో హార్థిక్ మెరుపు బ్యాటింగ్ తో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. కాగా శివమ్ దూబే స్థానంలో ఎంపికైన తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.
భారత తుది జట్టు అంచనా :
సంజూ శాంసన్( వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్). రియాన్ పరాగ్, హార్థిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా
Read Also : Kamala Harris Vs Putin : ‘‘నేను ప్రెసిడెంట్ అయితే’’.. పుతిన్‌పై కమల కీలక వ్యాఖ్యలు