Site icon HashtagU Telugu

Ind Vs Pak Match Review: దుబాయ్ వేదికగా హైవోల్టేజ్ ఫైట్

Asia Cup

Asiacup Imresizer

వరల్డ్ క్రికెట్‌లో రసవత్తర పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇవాళ దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడబోతున్నాయి. గత టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సై అంటోంది. మరోవైపు పాకిస్థాన్‌ కూడా తమ జోరు కొనసాగించాలని ఉవ్విళ్ళూరుతోంది. గత రికార్డులు పక్కన పెడితే.. ప్రస్తుతం ఇరు జట్లూ దాదాపు సమఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఉత్కంఠ పోరు ఖాయమని చెప్పొచ్చు.
ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ ఎప్పుడు తలపడినా ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు.. సాధారణ అభిమాని నుంచి సెలబ్రిటీ వరకూ ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. చాలా కాలంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు బ్రేక్ పడడంతో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. చివరిసారిగా గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో తల
పడిన ఇరు జట్లూ ఇప్పుడు ఆసియాకప్ వేదికగా ఢీకొనబోతున్నాయి. ఇవాళ దుబాయ్ వేదికగా జరగనున్న ఈ హైవోల్టేజ్ క్లాష్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. గత కొంత కాలంగా వరుస సిరీస్ విజయాలతో ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆసియా కప్‌లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ టోర్నీ జట్టు కూర్పును పరిశీలించుకునేందుకు చక్కని అవకాశంగా చెప్పొచ్చు. అయితే పాక్‌తో మ్యాచ్ అంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో చిత్తుగా ఓడిన భారత్ ఇప్పుడు రివేంజ్‌ తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. టీమిండియాలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్‌ పైనే అందరి దృష్టీ నెలకొంది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లీ తనపై విమర్శలకు ఆటతోనే సమాధానమిచ్చేందుకు పాక్‌తో మ్యాచ్‌ మించిన ఛాన్స్ లేదనే చెప్పాలి. అటు కెప్టెన్ రోహిత్‌శర్మ , కెఎల్ రాహుల్ కూడా ఫామ్‌ అందుకోవాల్సి ఉండగా.. మిగిలిన బ్యాటింగ్‌లో హార్థిక్ పాండ్యా, పంత్‌లపై అంచనాలున్నాయి. ఇక ఐపీఎల్‌ 15వ సీజన్‌ నుంచీ ఫినిషర్‌గా మారిన దినేశ్ కార్తీక్‌ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్‌కు తోడు అర్షదీప్‌సింగ్‌ ఆడనున్నాడు. స్పిన్‌ విభాగంలో జడేజా, చాహల్‌ కీలకం కానున్నారు. మరోవైపు పాకిస్థాన్ కూడా బలంగానే ఉంది. కీలక బౌలర్ షాహిన్ అఫ్రిది గాయంతో దూరమైనప్పటకీ… మిగిలిన బౌలర్లను తక్కువ అంచనా వేయలేం. ఇదిలా ఉంటే గత రికార్డుల పరంగా భారత్‌దే పైచేయిగా ఉంటే… ఈ సారి బలాబలాల పరంగా సమఉజ్జీల సమరంగా చెప్పొచ్చు. దీంతో సూపర్ సండే రోజున అభిమానులకు అసలు సిసలు క్రికెట్ విందు ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version