Site icon HashtagU Telugu

Cheteshwar Pujara : పాపం పుజారా.. భారత వెటరన్ ప్లేయర్ పై ఈసీబీ సస్పెన్షన్

Pujara Suspended By Ecb For County Championship Game

Pujara Suspended By Ecb For County Championship Game

Cheteshwar Pujara : ప్రపంచ క్రికెట్ లో భారత క్రికెటర్లు హద్దు మీరి ప్రవర్తించడం తక్కువగానే చూస్తుంటాం. క్రమశిక్షణా చర్యలతో వారు జరిమానా లేదా నిషేధం ఎదుర్కోవడం ఎప్పుడో గాని జరగదు. అలాంటిది భారత టెస్ట్ ప్లేయర్ చటేశ్వర పుజారా (Cheteshwar Pujara :)పై ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక మ్యాచ్ నిషేధం విధించింది. పుజారా వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. అలాంటిది పుజారాపై వేటా అనుకుంటున్నారా…అసలు పుజారాపై ఈ నిషేధానికి కారణం అతని సహచరులే.. విషయమేమిటంటే పుజారా ప్రస్తుతం కౌంటీ క్రికెట్ లో ససెక్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ససెక్స్‌ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. దీని ఫలితం​ జట్టు కెప్టెన్‌ అయిన పుజారాపై పడింది. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు నిబంధనల ప్రకారం ఓ సీజన్‌లో ఓ జట్టు నాలుగు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలను ఎదుర్కొంటే, సదరు జట్టు కెప్టెన్‌పై ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు పడుతుంది. టోర్నీ తొలి లెగ్‌లో రెండు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్‌.. సెప్టెంబర్‌ 13న లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రెండు పెనాల్టీలతో కలిపి మొత్తంగా 12 డీమెరిట్‌ పాయింట్లను పొందింది.

ఆటగాళ్ల ఆన్‌ ఫీల్డ్‌ ప్రవర్తన కారణంగా ససెక్స్‌పై ఈసీబీ చర్యలు తీసుకుంది. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్‌ ఆటగాళ్లు టామ్‌ హెయిన్స్‌, జాక్‌ కార్సన్‌, అరి కార్వెలాస్‌లు మైదానంలో నిబంధనలకు అతిక్రమించడంతో కెప్టెన్‌ గా పుజారా (Cheteshwar Pujara :)నే బాధ్యత వహించాల్సి వచ్చింది. ఈ ముగ్గురు ఆటగాళ్లలో టామ్‌ హెయిన్స్‌, జాక్‌ కార్సన్‌లపై ససెక్స్‌ అధికారులు తదుపరి మ్యాచ్‌ ఆడకుండా వేటు వేశారు. విచారణ ముగిసిన తర్వాత మరో ఆటగాడు కార్వెలాస్‌పై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా, పాయింట్ల కోత కారణంగా ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్‌ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారింది.

Also Read:  India ODI Series : టీమిండియా కెప్టెన్‌ గా కెఎల్ రాహుల్.. ఆసీస్‌ తో వన్డే సిరీస్‌ కు భారత జట్టు ఇదే