Site icon HashtagU Telugu

Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

Virat Kohli

Virat Kohli

Virat Kohli: కోల్‌కతా తర్వాత గౌహతిలోనూ దక్షిణాఫ్రికా టీమ్ ఇండియాను ఓడించింది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల రికార్డు తేడాతో విజయం సాధించింది. 25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్‌కు అత్యంత ఘోరమైన ఓటమి తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయ‌న ఓ మీడియాకు ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్‌ను తొలగించే ముందు సెలక్షన్ కమిటీని తొలగించాలని అన్నారు. అంతేకాకుండా ప్రధాన మంత్రి మోదీ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి కాల్ చేయాలని కూడా ఆయన సూచించారు.

భారత్ ఓటమికి గల కారణాలను వివరించిన బాసిత్ అలీ

దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమికి అతిపెద్ద కారణం ఏమిటని ఇంటర్వ్యూలో బాసిత్ అలీని అడగగా, దానికి సమాధానంగా ఆయన ఇలా అన్నారు. మీ ఆటగాళ్లు వైట్ బాల్ క్రికెట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. డబ్బు పాత్ర పెరిగింది. మీరు ఇంగ్లాండ్‌లో సిరీస్‌ను సమం చేసి వచ్చారు. అది మీ ఘనత కాదు. అది వారి పొరపాటు. వారి పిచ్‌లు సరిగ్గా లేవు. వారు వన్డే స్టైల్ పిచ్‌లను తయారు చేశారు. వారు వేగంగా క్రికెట్ ఆడుతున్నారు అని తెలిపారు.

Also Read: Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

ఇంకా మాట్లాడుతూ.. మీ ఆడే శైలి ఎందుకు మారింది? భారత్ గతంలో స్పిన్నర్లను ఆడలేదా? రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ వంటి వారు స్పిన్నర్లను అద్భుతంగా ఆడలేదా? లక్ష్మణ్, ద్రవిడ్‌తో కలిసి ఆస్ట్రేలియాపై ఆ భాగస్వామ్యం చేసినప్పుడు అక్కడ బంతి బ్రేక్ అవ్వలేదా? నిజానికి, భారత కోచ్ టెస్ట్ ఫలితం రెండున్నర రోజుల్లో తమకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు. కానీ రెండున్నర రోజుల పిచ్‌లు తయారుచేసినప్పుడు టాస్ పాత్ర ముఖ్యమవుతుంది. టాస్ పాత్ర రావకూడదు. టెస్టుల్లో బ్యాటింగ్‌ను ప్రేమించే ఆటగాళ్లను ఎంపిక చేయాలి. షాట్స్‌ను ప్రేమించేవారిని ఎంపిక చేయాలి. పంత్ లాగా రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి అవుట్ అయ్యే ఆటగాళ్లను ఎంపిక చేయకండి. మీరు అలా చేయకపోతే అప్పుడు భారతదేశం కూడా బంగ్లాదేశ్, వెస్టిండీస్, పాకిస్తాన్ లాగా తయారవుతుంది. శ్రీలంకతో ఆడితే గెలుస్తారు. మిగిలిన బలమైన జట్లతో ఆడితే ఓడిపోతారని సూచించారు.

ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి

ఇంటర్వ్యూలో బాసిత్ అలీ మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్‌ను తొలగించే ప్రస్తావన వస్తే అంతకు ముందు సెలక్షన్ కమిటీని తొలగించాలి. సెలక్షన్ కమిటీ తొలగి, గౌతమ్ గంభీర్ తొలగిస్తే, ఐపీఎల్ స్టైల్‌లో టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఆ ఆటగాళ్లను కూడా తొలగించాలి. వారికి కూడా విశ్రాంతి ఇవ్వాలి. సెలెక్టర్లు పారాచూట్ ద్వారా ఆటగాళ్లను జట్టులోకి ఎలా తీసుకువస్తున్నారు. 15 మందిలో నితీష్ రెడ్డి పేరు లేదు. కానీ అతను జట్టులోకి వస్తాడు. దేవ్దత్ పడిక్కల్ ఆడడు. కరుణ్ నాయర్ ఎందుకు లేడు? సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు లేడు? వీరంతా మంచి టెస్ట్ మ్యాచ్ ప్లేయర్లు. ఈ ప్రశ్నలకు చాలా మంది వద్ద సమాధానం ఉంటుంది. చాలా మంది వద్ద ఉండదు. నిజానికి ఇంగ్లాండ్ తమ స్టైల్‌ను మార్చుకుంది. ఇప్పుడు ప్రపంచం దాని వెనుక పడింది. టెస్ట్ క్రికెట్‌ను టెస్ట్ క్రికెట్ లాగే ఆడాలన్నారు.

భారతదేశం ఇంత పెద్ద దేశం. పీఎం మోదీ.. విరాట్ కోహ్లీకి ఒక కాల్ చేసి మియా (సోదరుడు) మీరు తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నారు. దేశానికి మీ అవసరం ఉంది. మీరు రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకోండి అని చెప్పాలి. దీనికి ఇదే ఏకైక పరిష్కారమ‌ని ఆయ‌న ముగించారు.

Exit mobile version