PM Modi Praises Samson: శుక్రవారం (ఏప్రిల్ 3) కేరళ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడిలో సంజూ శాంసన్ కనబరిచిన ప్రదర్శన.. ఏకాగ్రత, నిగ్రహానికి ఒక గొప్ప పాఠమని ఆయన అన్నారు. “ప్రస్తుతం క్రికెట్ సీజన్ నడుస్తోంది. కేరళ ప్రజలు దీని నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం తరచుగా శాంసన్ ఆటలో చూసే పట్టుదలను ఈ వరల్డ్ కప్‌లోనూ చూశాం” అని ఆయన పేర్కొన్నారు.
టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ శాంసన్ ఆట మరింత మెరుగైందని మోదీ ప్రశంసించారు. “నిర్ణయాత్మక క్షణాలు, నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కాగానే, అతని ప్రదర్శన శిఖర స్థాయికి చేరుకుంది. ఆరంభం నుండి చివరి వరకు అతని ఫోకస్, ఆత్మవిశ్వాసం, శక్తి నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇదే ఒక నిజమైన క్రీడాకారుడి గుర్తింపు” అని మోదీ అన్నారు.
Also Read: డిజిటల్ యుద్ధం.. ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?
నిజమైన ఆటగాడిగా శాంసన్ గుర్తింపు
జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో శాంసన్ తన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీశారని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రారంభంలో సాధారణ ప్రదర్శన కనబరిచినప్పటికీ కీలక మ్యాచ్‌ల్లో శాంసన్ విశ్వరూపం చూపాడు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ నాకౌట్ మ్యాచ్‌లో అతను అజేయంగా 97 పరుగులు చేశాడు.
ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో వరుసగా 89-89 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీనితో టీ20 వరల్డ్ కప్‌ను మూడుసార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా, అలాగే స్వదేశంలో ఈ టైటిల్ నెగ్గిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ శాంసన్ గణాంకాలు
టీ20 వరల్డ్ కప్ 2026లో తన అద్భుత ప్రదర్శనకు గాను సంజూ శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపికయ్యాడు.
మొత్తం పరుగులు: 5 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు.
సగటు: 80.25
స్ట్రైక్ రేట్: దాదాపు 200.
బౌండరీలు: 27 ఫోర్లు, 24 సిక్సర్లు.
రికార్డు: 2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ సాధించిన 319 పరుగుల రికార్డును శాంసన్ అధిగమించాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
