Chess Olympiad: ఘనంగా ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్

చెన్నై వేదికగా ప్రతిష్ఠాత్మక 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పోటీలను ప్రారభించారు.

  • Written By:
  • Publish Date - July 29, 2022 / 07:18 AM IST

చెన్నై వేదికగా ప్రతిష్ఠాత్మక 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పోటీలను ప్రారభించారు. ప్రపంచమంతా చుట్టేసిన ఒలింపియాడ్‌ టార్చ్‌ను ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిక్‌కు ప్రపంచ చెస్‌ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అందజేశాడు. చెస్‌ ఒలింపియాడ్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండటం ఇదే తొలిసారి. ఆగస్టు 10వ తేదీ వరకు పోటీలు జరుగుతాయి. చెస్‌ ఒలింపియాడ్‌లో ఆనంద్‌ పాల్గొనకుండా.. ఆటగాళ్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా
ఈ కార్యక్రమానికి మోదీ తమిళ తంబిలా పంచకట్టులో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రధాని పంచకట్టుతో పాటు భుజంపై కండువాతో వచ్చారు. చెన్నై చదరంగానికి పుట్టిల్లుగా మారిందనీ, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్‌ మాస్టర్లకు ఈ ప్రాంతం నిలయంగా మారిందని కొనియాడారు. చెస్ ఒలింపియాడ్ బృంద స్ఫూర్తిని చాటే గొప్ప క్రీడోత్సవం అని మోదీ అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యానే తొలుత ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే అక్కడి పరిస్థితుల నేపథ్యంలో టోర్నమెంట్‌ భారత్‌కు తరలివచ్చింది. ఆతిథ్యం ఇస్తున్న చెన్నై టోర్నీ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఆరంభ వేడుకల్ని అత్యద్భుతంగా నిర్వహించింది.

పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవం సందర్భంగా నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని బ్లాక్ అండ్ వైట్ గడులు కనిపించేలా తీర్చిదిద్దారు.ప్రారంభోత్సవంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.ఇక ఈ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఓపెన్‌, ఉమెన్స్ విభాగంలో పోటీలు జరగనున్నాయి. రెండు విభాగాల్లో ఆరు జట్లతో భారత్ బరిలోకి దిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్‌ ఎరిగైసి వివిధ జట్లలో ఆడనున్నారు.