Pooran: పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023లో భాగంగా బెంగుళూర్ లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు-లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు భారీ స్కోర్ చేసింది.

  • Written By:
  • Publish Date - April 11, 2023 / 07:25 AM IST

Pooran:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023లో భాగంగా బెంగుళూర్ లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు-లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన లక్నో ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఈ ఉత్కంఠ పోరులో బెంగళూరుపై లక్నో విజయం సాధించింది. రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది.

మొదట బ్యాటింగ్ బరిలోకి దిగిన కోహ్లీ సేన లక్నో బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ పోటాపోటీగా చెలరేగిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. వీరిద్దరు తొలి వికెట్ కు 96 పరుగులతో బెంగుళూర్ భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించారు. ఈ ఇన్నింగ్స్ లో కింగ్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అనంతరం కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. కోహ్లీ తర్వాత క్రీజులో అడుగుపెట్టాడు మ్యాక్స్ వెల్. డుప్లెసిస్,మాక్స్ వెల్ ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. మాక్స్ వెల్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 59 పరుగుల భారీ స్కోరును అందించాడు. ఓపెనర్ డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 79 రన్స్ బాదాడు. ఈ ముగ్గురి భాగస్వామ్యంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది.

213 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో బెంగుళూరుపై ఘన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే లక్నో మొదట పేలవ ప్రదర్శన చేసి కష్టాల్లో పడింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. కేవలం 1 పరుగు వద్ద కైల్ మేయర్స్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 23 పరుగుల వద్ద లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో లక్నో పరిస్థితి కష్టంగా మారింది. అప్పటివరకు స్కోర్ బోర్డు ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదు. ఈ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ తో కలిసి స్టోయినీస్ పరుగుల వరద పారించారు. నాల్గో వికెట్ కు ఇద్దరు 75 పరుగులు జోడించారు. స్టోయినీస్ 30 బంతుల్లో 65 పరుగులు రాబట్టాడు. కొంతసేపటికి స్టోయినీస్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో లక్నో 105 పరుగులకే వీక్ అయిపోయింది. విజయంపై ఏ మాత్రం ఆశలు లేకుండా పోయాయి. అప్పుడొచ్చాడు విండీస్ చిచ్చరపిడుగు. కష్టాల్లో ఉన్న తన జట్టును భుజాలపై వేసుకున్నాడు. జట్టును గెలిపించే బాధ్యతను నికోలస్ పూరన్ నెత్తిన వేసుకున్నాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి అందులో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో అదరగొట్టాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ చివర్లో మలుపు తిరిగింది. చివరి బంతికి ఆవేశ్ కాన్ పరుగు తీసి లక్నోను గెలిపించాడు. కాగా.. గెలుపు ఆశలే లేని సమయంలో ఉప్పెనలా వచ్చి వీరంగం సృష్టించిన పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.