Perth Scorchers: ఆదివారం పెర్త్ స్టేడియంలో జరిగిన బిగ్ బాష్ లీగ్ ఫైనల్‌లో సిడ్నీ సిక్సర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి పెర్త్ స్కార్చర్స్ రికార్డు స్థాయిలో తన టైటిల్ సంఖ్యను పెంచుకుంటూ విజేతగా నిలిచింది. తొమ్మిదవ సారి బిగ్ బాష్ లీగ్ ఫైనల్‌లో ఆడిన స్కార్చర్స్ 133 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించి లీగ్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఫిన్ అలెన్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 8.2 ఓవర్లలోనే 80 పరుగులు జోడించి, లక్ష్య ఛేదన సగం పూర్తి కాకముందే సిక్సర్స్‌ను రేసు నుంచి దాదాపు తప్పించారు.
Also Read: అమృత్ ఉద్యాన్ అంటే ఏమిటి? ప్రజల కోసం ఎప్పుడు తెరుస్తారు?
ఆరోన్ హార్డీ, కెప్టెన్ ఆష్టన్ టర్నర్ తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ హిట్టర్ జోష్ ఇంగ్లిస్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జాగ్రత్తపడి చివరికి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి జట్టుకు టైటిల్‌ను అందించాడు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్‌ను 20 ఓవర్లలో 132 పరుగులకే కట్టడి చేసింది. ఫాస్ట్ బౌలర్లు జై రిచర్డ్సన్, డేవిడ్ పేన్ చెరో మూడు వికెట్లు తీయగా మహ్లీ బార్డ్‌మన్ రెండు వికెట్లు పడగొట్టాడు. సిక్సర్స్ బ్యాటర్లలో ఎవరూ కూడా 24 పరుగుల కంటే ఎక్కువ చేయలేకపోయారు. స్టీవ్ స్మిత్, జోష్ ఫిలిప్ మరియు కెప్టెన్ మోయిసెస్ హెన్రిక్స్ మంచి ఆరంభాన్ని పొందినప్పటికీ ముగ్గురూ 24 పరుగుల వద్దే పెవిలియన్ చేరారు.
