ICC Promotions: ఫిబ్రవరి 2026 నుండి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ భారత్, శ్రీలంకలో జరగనుంది. ఆసియా కప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు తీవ్ర అవమానం ఎదురైనట్లే ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC Promotions) తాజాగా విడుదల చేసిన ప్రమోషనల్ పోస్టర్‌లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు చోటు కల్పించలేదు. తమ కెప్టెన్‌ను విస్మరించడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)కు అస్సలు నచ్చలేదు. ఈ అవమానంతో ఆగ్రహించిన PCB.. దీనిపై పెద్ద చర్య తీసుకునేందుకు సిద్ధమైంది.
పాకిస్తాన్ కెప్టెన్‌ను విస్మరించిన ICC
ICC ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026 అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఐదు దేశాల కెప్టెన్లు మాత్రమే కనిపించారు. వారిలో భారత్ నుండి సూర్యకుమార్ యాదవ్, దక్షిణాఫ్రికా నుండి ఐడెన్ మార్క్రమ్, ఆస్ట్రేలియా నుండి మిచెల్ మార్ష్, శ్రీలంక నుండి దాసున్ శనక, ఇంగ్లాండ్ నుండి హ్యారీ బ్రూక్ ఉన్నారు. పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు పోస్టర్‌లో చోటు దక్కకపోవడం PCBకి కోపం తెప్పించింది.
Also Read: Chinnaswamy Stadium: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి!
ICCకి PCB ఫిర్యాదు
ప్రమోషనల్ పోస్టర్‌పై తమ కెప్టెన్‌ను ఎందుకు చేర్చలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహంతో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియాకి PCBకి చెందిన ఒక మూలం తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం ఆసియా కప్‌లో కూడా మాకు ఇదే సమస్య ఎదురైంది. ఆ సమయంలో బ్రాడ్‌కాస్టర్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభించినప్పుడు అందులో మా కెప్టెన్ లేడు. ఇప్పుడు మేము మరోసారి అలాంటి పరిస్థితిలోనే ఉన్నాము. టికెట్ విక్రయాల కోసం రూపొందించిన ఈ ప్రమోషనల్ పోస్టర్‌లో ICC మా కెప్టెన్‌కు చోటు ఇవ్వలేదు అని తెలిపింది.
PCB అభ్యర్థనను ICC పరిగణలోకి తీసుకుంటుందా?
ఆసియా కప్ సమయంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తాము ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌తో (ACC) మాట్లాడామని, ఆ సమస్య పరిష్కారమైందని PCB మూలం తెలిపింది. ఇప్పుడు ICC నుండి కూడా అదే విధమైన పరిష్కారాన్ని ఆశిస్తున్నారు. ICC టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ప్రస్తుతం టాప్ 5లో లేదు. అందుకే బహుశా వారికి పోస్టర్‌లో చోటు దక్కలేదని భావిస్తున్నారు. అయితే తమ క్రికెట్ చరిత్ర, వారసత్వం చాలా గొప్పదని, తాము ప్రపంచకప్‌లో ప్రధాన ఆకర్షణలలో ఒకరిగా ఉంటామని పాకిస్తాన్ వాదిస్తోంది. రాబోయే రోజుల్లో ICC వారికి కూడా ప్రమోషనల్ పోస్టర్‌లో చోటు కల్పించే అవకాశం ఉందని PCB ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
