PAK vs ENG: వైరస్ ఎఫెక్ట్.. సందిగ్ధంలో పాక్,ఇంగ్లాండ్ తొలి టెస్ట్

పాక్ టూర్ ఆరంభానికి ముందే ఇంగ్లాండ్ కు షాక్ తగిలింది.

  • Written By:
  • Updated On - November 30, 2022 / 10:59 PM IST

పాక్ టూర్ ఆరంభానికి ముందే ఇంగ్లాండ్ కు షాక్ తగిలింది. ఇంగ్లాండ్ జట్టులో 14 మంది గుర్తు తెలియని వైరస్ బారిన పడ్డారు. బెన్ స్టోక్స్ తో సహా 14 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంగ్లండ్ టీమ్‌లో కేవలం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే బుధవారం ప్రాక్టీస్‌ సెషన్ కు హాజరయ్యారు. హ్యారీ బ్రూక్‌, జాక్‌ క్రాలీ, కీటన్‌ జెన్నింగ్స్‌, ఓలీ పోప్, జో రూట్‌ మాత్రమే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సహా మిగతా ప్లేయర్స్‌ అందరూ హోటల్‌ రూమ్స్‌కే పరిమితమయ్యారు. ఇది ఫుడ్ పాయిజినింగ్ లేదా కోవిడ్ అనుకోవడం లేదని, అయితే ఆటగాళ్ళ మాత్రం అంత కంఫర్ట్ గా లేరని ఇంగ్లండ్ టీమ్ అధికారి ఒకరు వెల్లడించారు.

మ్యాచ్ సమయానికి సిద్ధమయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో గురువారం జరగనున్న తొలి టెస్టుపై సందిగ్ధత నెలకొంది. మ్యాచ్ ఆరంభానికి రెండు గంటల ముందు వాయిదాపై నిర్ణయం తీసుకుంటామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం ఈసీబీతో దీనిపై చర్చ జరుపుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే తొలి టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తన తుది జట్టును కూడా ప్రకటించింది. లియామ్‌ లివింగ్‌స్టోన్ తన టెస్ట్‌ అరంగేట్రం చేస్తున్నాడు. దాదాపు 17 ఏళ్ళ తర్వాత పాక్ గడ్డపై ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లు ఆడబోతోంది. టీ20 వరల్డ్‌కప్‌ ముందు కూడా పాకిస్థాన్‌లో పర్యటించిన ఇంగ్లండ్‌ ఏడు టీ20ల సిరీస్ ఆడింది. ఆ పర్యటనకు కొనసాగింపుగా మూడు టెస్టులు ఆడనుంది.