ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకపై తమ దేశం ఓడిపోవడాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అసహనాన్ని ఎదుటివారిపై చూపిస్తున్నారు. తాజాగా పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తన అనుచిత ప్రవర్తనతో విమర్శల పాలయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టేడియం బయట విలేఖరులు రమీజ్ రాజాను పలకరించారు. ఈ సందర్భంగా రోహిత్ జుల్గన్ అనే భారత జర్నలిస్ట్ రమీజ్ ను ప్రశ్న అడిగాడు. పాక్ అభిమానులు ఈ ఓటమితో నిరాశ చెంది ఉంటారు కదా అని అడిగాడు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రమీజ్ రాజా మీరు ఇండియా నుంచి వచ్చారా.. చాలా సంతోషంగా ఉన్నారనుకుంటా అంటూ వ్యంగంగా సమాధానమిచ్చాడు. జర్నలిస్ట్ ఏదో అడుగుతుండగానే దురుసుగా ప్రవర్తిస్తూ అతని ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అనంతరం రోహిత్ జుల్గన్ ట్విట్టర్ వేదికగా రమీజ్ రాజాను మరోసారి ప్రశ్నించాడు. నేను తప్పు ఏమీ అడగలేదని, కానీ మీరిలా ఫోన్ లాక్కోవడం సరికాదంటూ రమీజ్ రాజాకు ట్యాగ్ చేశాడు. రమీజ్ రాజా ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, మాజీ క్రికెటర్ అయి ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తారా అని విమర్శిస్తున్నారు. ఓటమిని హుందాగా అంగీకరించాల్సిన వ్యక్తి ఇలా అనుచితంగా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించి ఆరోసారి ఆసియాకప్ కైవసం చేసుకుంది.
https://twitter.com/rohitjuglan/status/1569041944755544064