PCB Chairman: లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో పునరుద్ధరణ పనులను పరిశీలించారు పీసీబీ ఛైర్మన్ (PCB Chairman) మొహ్సిన్ రజా నఖ్వీ. స్టేడియం వెలుపల పనులు పూర్తి కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్టేడియం లోపల ఆధునిక ఫ్లడ్ లైట్లు మరియు కొత్త స్క్రీన్ స్టాండ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీ ప్రారంభం నాటికి ఈ పని పూర్తవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిధ్యమిస్తుంది. టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం నెలన్నర సమయం మాత్రమే ఉంది. కానీ టోర్నమెంట్ ఏర్పాట్లు పూర్తి కాలేదు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ టోర్నీ సన్నాహాలను పరిశీలించేందుకు లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంకు వచ్చారు. స్టేడియం పరిస్థితి చూసి మొహ్సిన్ రజా కూడా ఆశ్చర్యపోయాడు. మైదానం నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో సిబ్బందిని పిలిపించి వివరాలు తెలుసుకున్నాడు. గడ్డాఫీ స్టేడియానికి వెళ్లే రోడ్డు శిథిలావస్థలో ఉంది. అయితే గ్రౌండ్ లోపలి నిర్మాణ పనులను ప్రశంసించారు. స్టేడియానికి ఇంకా తుది మెరుగులు దిద్దాల్సి ఉంది.
గడ్డాఫీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 22న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జరగడానికి ఇంకా నెలన్నర సమయం మిగిలి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌తో సహా 4 మ్యాచ్‌లు గడ్డాఫీ స్టేడియంలో జరగనున్నాయి. ఇదిలా ఉంటె టీమిండియా పాక్ లో పర్యటించనందున భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ మోడల్ లో జరుగుతాయి. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న భారత్ 2017 ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది.