Ruthless LSG: రాణించిన లక్నో బౌలర్లు…పంజాబ్ కు మరో ఓటమి

ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి వచ్చిన చక్కని అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ చేజేతులా జారవిడిచికుంది.

  • Written By:
  • Publish Date - April 29, 2022 / 11:51 PM IST

ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి వచ్చిన చక్కని అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ చేజేతులా జారవిడిచికుంది. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక చతికిలపడింది. తమ బౌలర్లు కష్టపడ్డా బ్యాటర్లు మళ్లీ పాత కథే రిపీట్ చేశారు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46, దీపక్ హుడా 28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34 రన్స్ తో టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో దుష్మంత్ చమీర 17, మోహ్‌సిన్ ఖాన్13 నాటౌట్ ధాటిగా ఆడటంతో లక్నో 150 పరుగుల మార్క్ అందుకోగలిగింది.
కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరచగా.. క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించడంతో లక్నో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో రబడాకు తోడుగా రాహుల్ చాహర్ రెండు, సందీప్ శర్మ ఓ వికెట్ తీసాడు.

లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. ఆ జట్టు సారథి మయాంక్ అగర్వాల్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల తో 25 రన్స్ చేయగా.. ధావన్ మాత్రం క్రీజులో నిలవడానికి ఇబ్బందిపడ్డాడు. వీరిద్దరూ ఔటయ్యక పంజాబ్ స్కోరు పూర్తిగా నెమ్మదించింది. అయితే బెయిర్ స్టో 28 బంతుల్లో 32 , లివింగ్ స్టోన్ 16 బంతుల్లో 18 రన్స్ తో ధాటిగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తి కరంగా మారింది. లివింగ్ స్టోన్ ఔట్ తర్వాత పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.లక్నో బౌలర్లలో మోసిన్‌ ఖాన్‌ 3, కృనాల్‌ పాండ్యా, చమీర చెరో రెండు వికెట్లు తీశారు. ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది ఐదో ఓటమి. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ఇక లక్నో… 9 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించి మూడో స్థానానికి చేరింది.