Site icon HashtagU Telugu

PBKS vs DC: పంజాబ్ కింగ్స్ బోణీ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం

PBKS vs DC

PBKS vs DC

PBKS vs DC: ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. తన తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిడిలార్డర్ వైఫల్యం, ఒక బౌలర్ తక్కువగా ఉండడం ఢిల్లీ ఓటమికి కారణమైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు వార్నర్ , మార్ష్ 39 పరుగులు జోడించారు. వార్నర్ 29, మార్ష్ 20 రన్స్ చేయగా.. హోప్ 33 పరుగులు చేశాడు. రీ ఎంట్రీలో పంత్ పర్వాలేదనిపించాడు. 18 పరుగులు చేసి ఔటయ్యాడు. రికీ భుయ్ , స్టబ్స్ నిరాశపరచగా…అక్షర్ పటేల్ విలువైన పరుగులు చేశాడు. అయితే చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అభిషేక్ పోరెల్ విధ్వంసం సృష్టించాడు. ఆఖరి ఓవర్లో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఓవర్లో పోరెల్ జోరుకు 25 పరుగులు వచ్చాయి. ఫలితంగా ఢిల్లీ 174 పరుగులు చేసింది.

175 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. బెయిర్ స్టో 9 రన్స్ కే ఔటైనప్పటకీ ధావన్ ధాటిగా ఆడి 22 పరుగులు చేశాడు. తర్వాత ప్రభ్ సిమ్రన్ సింగ్ , శామ్ కరన్ జోడీ మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేసింది. పస లేని ఢిల్లీ బౌలింగ్ ను శామ్ కరన్ ఆటాడుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ దక్కించుకున్న కరన్ తన రోల్ కు న్యాయం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడు లివింగ్ స్టోన్ కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్ టార్గెట్ ను అందుకుంది. చివర్లో ఖలీల్ అహ్మద్ వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. దీనికి తోడు ఫీల్డింగ్ చేస్తూ ఇశాంత్ శర్మ గాయపడడంతో అనుభవం లేని బౌలర్ తో బౌలింగ్ చేయించాల్సి రావడం కూడా ఢిల్లీ కొంపముంచింది. చివరికి పంజాబ్ మరో 4 బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని ఛేదించింది. శామ్ కరన్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 63 పరుగులు చేయగా… లివింగ్ స్టోన్ కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ , ఖలీల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Also Read: PBKS vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ .. మైదానం వీడిన ఇషాంత్ శర్మ

Exit mobile version