PBKS vs CSK: Ambati Rayudu’s sensational 78 in vain as PBKS break CSK hearts at Wankhede

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ ఓటమి బాట పట్టింది.

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 12:08 AM IST

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ ఓటమి బాట పట్టింది. ముంబై తర్వాత టోర్నీ నుంచి నిష్కమించే జట్టు తామే అన్నట్టుగా మరి పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆసక్తికరంగా సాగిన పోరులో పంజాబ్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. రాయుడు మెరుపు ఇన్నింగ్స్ చెన్నైని గెలిపించ లేకపోయింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలమయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స సాయంతో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరి జోరుతో పంజాబ్ బాగానే పుంజుకుంది. దీనికి తోడు చెన్నై ఫీల్డింగ్ కూడా వారికి కలిసొచ్చింది. ఈ అవకాశాలతో చెలరేగిన రాజపక్స.. చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.అటు ధాటిగా ఆడిన ధావన్ బౌండరీ బాది కెరీర్‌లో 46వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రిటోరియస్ వేసిన 19వ ఓవర్‌లో లివింగ్ స్టోన్ 4, 6, 6 కొట్టగా.. ధావన్ బౌండరీ బాదడంతో 22 పరుగులు వచ్చాయి. చివరికి పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ధావన్ 59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 88 రన్స్ తో అజెయంగా నిలిచాడు.

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ త్వరగానే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. దీంతో పవర్ ప్లేలో 33 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితుల్లో రవీంద్ర జడేజాతో కలిసి రాయుడు చెలరేగాడు. రాహుల్ చాహర్ వేసిన 15వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సందీప్ శర్మ వేసిన మరుసటి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన రాయుడు 23 పరుగులు రాబట్టాడు. అయితే మరింత ధాటిగా ఆడే క్రమంలో 17వ ఓవర్‌లో ఔటయ్యడు. చివరి 12 బంతుల్లో సీఎస్‌కే విజయానికి 35 పరుగులు అవసరమయ్యాయి. చివర్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. దీంతో అంబటి రాయుడు 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78 పరుగులతో చేసిన ఒంటరి పోరాటం వృథా అయింది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా, రిషి ధావన్ రెండేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ,అర్ష‌దీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.