ఐపీఎల్ 15వ సీజన్ ప్లే ఆఫ్ బెర్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. మిగిలిన మూడు బెర్తుల కోసం ప్రతీ మ్యాచ్ కీలకంగా మారిన వేళ పంజాబ్ కింగ్స్ , బెంగళూరుపై 54 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ లో బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ , బౌలింగ్ లో రబాడ, రిషి ధావన్ రాణించారు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు బెయిర్‌స్టో-శిఖర్ ధావన్ కేవలం ఐదు ఓవర్లలోనే 60 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశారు. ధావన్, హసరంగ వెంటవెంటనే ఔటైనా.. బెయిర్ స్టో జోరు తగ్గలేదు. భారీ షాట్లతో వీరవిహారమే చేశాడు. వరుస సిక్సర్లు, ఫోర్లు కొడుతూ విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 66 పరుగులు చేసిన బెయిర్‌స్టో ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. మిడిలార్డర్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ కూడా చెలరేగి ఆడడంతో పంజాబ్ స్కోర్ టాప్ గేర్ లో సాగింది. ధాటిగా ఆడుతూ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న లివింగ్‌స్టోన్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. లివింగ్ స్టోన్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 రన్స్ చేసాడు. చివర్లో బెంగళూరు బౌలర్లు పంజాబ్ ను కట్టడి చేశారు. ఆఖరి ఓవర్‌లో హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగుల వేగాన్ని తగ్గించాడు. ఆ ఓవర్‌లో ఓ రనౌట్ సహా రెండు వికెట్లు పడ్డాయి. లివింగ్‌స్టోన్, రిషి ధావన్ వికెట్లను కోల్పోవడంతో చివరి ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో పంజాబ్ కింగ్స్ 209 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో వానిండు హసరంగా, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
భారీ లక్ష్యఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. నాలుగో ఓవర్లో కోహ్లీ ఔటవగా.. కాసేపటికే డుప్లెసిస్ కూడా వెనుగిరిగాడు. లామ్రోర్ కూడా నిరాశపరిచడంతో ఆర్సీబీ వరుస వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పటిదార్, మాక్స్ వెల్ ధాటిగా ఆడడంతో మళ్ళీ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ ఆరు ఓవర్లలో 64 పరుగుల పార్టవర్ షిప్ సాధించారు. అయితే వరుస ఓవర్లలో మాక్స్ వెల్, పటిదార్ ఔటవడంతో బెంగళూరు జోరుకు బ్రేక్ పడింది. తర్వాత దినేశ్ కార్తీక్ కూడా త్వరగానే ఔటవజంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది. చివరికి బెంగుళూరు 155 పరుగులు చేయగలిగింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా… బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మిగిలిన ఒక మ్యాచ్ లో బెంగళూరు గెలిచినా ఇతర జట్ల ఫలితాలు, రన్ రేట్ పై ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.